మంచి మాట : మంచి చేసి చూడు.. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది ..!

Divya
ఒకరోజున అడవిలో చెట్టు నీడలో ఒక సింహం , ఆ పక్కనే ఉన్న కన్నం లో ఒక ఎలుక ఉంటోంది. అది బయటకు వచ్చేసరికి , పీచు లాంటి మెత్తని గడ్డి లాంటిది. ఏదో అక్కడ కుప్పలాగా పడి ఉంది. దానిపైకి ఎక్కి ఆడుకుంటే మజాగా ఉంటుంది. అనుకొని ఆ ఎలుక దానిపైకి ఎక్కి సంతోషంగా ఎగురుతోంది. కానీ అది ఎక్కినది సింహం పైకి అంతే కానీ అది గడ్డి కాదు. వెంటనే సింహానికి మేలుకువ వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. అటుఇటు వెతకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది. దాన్ని పంజాతో పైకి ఎత్తి పట్టుకొని ఎలుక ముండ,నీకెంత ధైర్యమే..? నా నిద్ర అంతా పాడు చేసావు. నిన్ను చంపేస్తాను అంది సింహం
భయంతో ఎలుక గడగడా వణికి పోతూ క్షమించండి మహాప్రభు.. నేను మిమ్మల్ని చూడలేదు. ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకుంటున్నాను. దయ చేసి నన్ను వదిలేయండి. నేను ఎప్పుడో ఒకప్పుడు సాయం చేసి మీ రుణం తీర్చుకుంటాను. అంది
చూస్తే వేలెడంత లేవు.. నీవు నాకు ఏం సహాయం చేయగలవు .సరేలే నిన్నిప్పుడు దయతలచి వదిలేస్తాను. జాగ్రత్తగా ఉండు అని సింహం దాన్ని వదిలేసింది.
ఒకనాడు,ఆ ఆడవిలో ఒక వేటగాడు ఒక వల పన్ని ఉంటాడు. పొరపాటున సింహం ఆ వలలో చిక్కుకుంది. ఏమి చేయలేక దీనంగా అరవటం మొదలు పెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవరూ రాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటకు వచ్చిన ఆ చిట్టెలుకకు , ఆ సింహం అరుపులు వినిపించాయి. అది సింహం గొంతును గుర్తు పట్టి, ఒక్కపరుగున అక్కడికి చేరుకొని మహారాజా భయపడకండి ..! నేను మీకు సహాయం చేస్తాను. అంది. అటూ ఇటూ చూసింది. వేటగాడు దగ్గర్లో ఎక్కడ లేడు.. వెంటనే వెళ్లి వల తాళ్లను ముక్కలు ముక్కలుగా కొరికేసింది. సింహం ఆనందంగా బయటకు వచ్చి చిట్టెలుకను ఒక్కసారి పైకెత్తి ముద్దాడి వదిలిపెట్టింది.
సహాయం చేసే ఆలోచన ఉండాలి కానీ అది ఎవరైతే నేమి.. మీరు కూడా ఇతరులకు సహాయపడండి వారివల్ల ఎప్పుడో ఒకసారి మీకు ప్రయోజనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: