మంచిమాట : చెడు స్నేహం అనర్థాలకు దారితీస్తుంది..
వ్యక్తిత్వం అనేది మనిషి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఎవరికీ హాని తలపెట్టకపోయినప్పటికీ , చెడ్డవారితో స్నేహం మనకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఇలా చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల కలిగే ప్రమాదం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండే ది అడవిలోని జంతువులను చంపి తిని, తన ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా సరే దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్ర పోయే సమయంలో దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి, మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించసాగేది. ఇక ఈ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా, తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెబుతుండేది..
యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపిందో, కోతికి వర్ణించి చెప్పింది.ఆ మాటలు విన్న కోతికి తోడేలు, మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో, కోతికి చూడాలనిపించేది.. ఒకరోజు కోతి తోడేలుతో.. "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా.. నీ పనితనం నాకు చూడాలని ఉంది." అంటూ అడిగింది. అందుకు తోడేలు ."సరే .. నిన్ను ఈరోజు రాత్రికి తీసుకెళ్తాను. రాత్రికి నువ్వు సిద్ధంగా ఉండు "అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా సంతోషంతో గంతులు వేయసాగింది. ఇక తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతున్న విషయాన్ని గమనించిన ఊరి వారు, ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయడం మొదలు పెట్టారు.
ఈ విషయం తెలియని తోడేలు, కోతితో కలిసి ఆ ఊరి లో ప్రవేశించింది. మేకలను తినడానికి , వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. ఇక మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పై కర్రలతో దాడి చేశారు .పక్కన ఉన్న కోతిని కూడా చితకబాదారు. ఇక ఈ దెబ్బలకు తట్టుకోలేక.."మేకలు తినడానికి వచ్చింది.. తోడేలు..నేను కాదు..నన్ను ఎందుకు కొడుతున్నారు వదిలేయండి" అని అడిగింది. తోడేలుకు సహాయంగా నువ్వు వచ్చావు కదా ..! నిన్ను మాత్రం ఎలా విడిచి పెడతామంటూ కొట్టసాగారు. ఇక ఆ దెబ్బలతో నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని, బతుకుజీవుడా అంటూ అడవికి చేరుకుంది. ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయకూడదని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి చెడు సాహసం చేసే వారితో స్నేహం చేయడం కూడా మానేసింది.