మంచి మాట : నిజం తెలియనప్పుడు ఎవరిని నిందించకూడదు.

Divya

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు వుండేవారు. ఆయన చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ  తన రాజ్యం గుండా వెళ్లే పేద బాటసారులకు ప్రత్యేక సత్రం కట్టించి, మద్యాహ్న భోజనం వండించి మరీ పెట్టేవాడు.
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న  ఒక గద్ద తన కాళ్ళతో పట్టుకున్న పాము నోటి నుండి  విషం కారుతోంది. అది కాస్త  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న అన్నం బేసిన్ లో పడింది. అయితే ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు.
 
ఇక ఆ అన్నాన్ని ఒక బాటసారి తిన్నాడు. అది విషం కలిసిన భోజనం కావడం వల్ల  అతను తెలియక తినడం  వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి  చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు  చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన   చింతించాడు. ఏ పాపం ఎరుగని ఒక బాటసారి తన ప్రాణాలను కోల్పోయాడు అంటూ ఆ రాజు తీవ్రంగా బాధ పడసాగాడు.
అయితే ఇప్పుడు బాటసారి చనిపోవడానికి కారణం  ఎవరు?
ఆ రాజా ? వంటవాడా ? పామా ? గద్దా? లేక వడ్డించిన  వ్యక్తా ? ఎవరిదీ పాపం?
రాజు చేసేది ధర్మ కార్యం కాబట్టి అతనిది తప్పు లేదు.
గ్రద్దకు పాము ఆహారం  కాబట్టి దాని తప్పు కూడా కాదు.
పాముది మరణ బాధ కొట్టుకుంటోంది. దాని తప్పు లేదు.
వడ్డించే వాడికి అసలు విషయం తెలీదు, అతని పని అతను చేస్తున్నాడు. కాబట్టి అతని తప్పూ లేదు.
మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
వీరిలో ఎవరూ కావాలని ఆ బాటసారిని చంపలేదు .
యమ ధర్మరాజును.. చిత్ర గుప్తుడు అడిగాడు.
యమధర్మరాజు కు ఏమి చెప్పాలో అర్థం కాక, అది అలా ఉంచు, బాగా ఆలోచించి చెపుతాను అన్నాడు.
 
ఇది ఇలా ఉంటే  కొన్ని రోజుల తర్వాత ఆ దారినే  పోతున్న  బాటసారులు  కొందరు   రాజుగారు  బాటసారులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో  చెప్పమని ఒక వనితను చిరునామా అడిగారు .
ఆమె వారికి దారిని చూపుతూ..“  బాబూ ! జాగ్రత్త  మా  రాజు గారికి బాటసారులు అంటే పడదు , కొద్ది రోజుల క్రితమే ఒకాయనను విషం పెట్టి చంపేశారు”..    మీ  రోజులు  బాగున్నాయో లేదో  ?  చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది.
ఇక విషయం తెలుసుకున్న  వెంటనే యమధర్మరాజు  
“ చిత్రగుప్తా !  మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో  వెయ్యి అన్నాడు.
సదుద్దేశ్యంతో  ధర్మ కార్యాలను చేసేటప్పుడు
యాదృచ్చికంగా జరిగే పనులకు , తప్పు ఎవరిదో తెలీకుండా నిందలను ఆపాదిస్తూ, వ్యక్తులను  నిందించే  వారికే ఆ మొత్తం కర్మఫలం కలుగుతుంది అని  ధర్మరాజు .”  అన్నారు.
కాబట్టి  విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరిమీద  మనం నిందారోపణలు చేస్తే, ఆపాపం మనకే వస్తుంది.తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: