మంచిమాట : ఎవరినీ నిర్లక్యం చేయవద్దు.. ముఖ్యంగా గ్రామ దేవతలను.

Divya

ఈ కరోనా కాలంలో చాలామంది తీవ్ర భయాందోళనలకు గురై , భగవంతుడిని స్మరించడం మొదలుపెట్టారు. అంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తాడా ? మిగతా సమయంలో గుర్తుకు రాడా అనే విషయాలు తప్పకుండా అందరూ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వస్తే ఇంట్లో ఉన్న భగవంతుడు మాత్రమే ప్రార్థిస్తారు. ఊరి చివర నా కంటికి రెప్పలా కాపాడుకొనే గ్రామ దేవతలను ఎందుకు పట్టించుకోరు. ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ , ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ సంవత్సరం అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి, మన కృతజ్ఞతను తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం లోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్రకోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది.
ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించినా, అందులో నుండే ప్రకటమై పలుకుతుంది, కోరికలు తీరుస్తుంది, వ్యాధులు నివారిస్తుంది ఆ తల్లి. పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజా తంతులతో పనిలేదు, భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, యద్భావం తద్భవతి అన్నట్లు మన భావాన్ననుసరించి కోరికలు నెరవేరుస్తుంది.
గ్రామ దేవతలను పూజించి, జాతరలు, తిరునాళ్ళు, అగ్ని గుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపు వేస్తుంటారు, ఆ జాతర రోజులలో ఎవరూ ఆ గ్రామా సరిహద్దులు దాటకూడదు అని నియమం ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి, వారు వెళ్తున్న పనిని అమ్మకు చెప్పుకుని, చీకటి పడడానికి ముందే తిరిగి గ్రామానికి వస్తామని చెప్పి మరీ వెళ్ళేవారు.
కొన్ని గ్రామాలలో తమ పిల్లలకు గ్రామదేవత పేరు కూడా జతచేర్చి నామకరణం చేసేవారు. వేరే ఊళ్లలో స్థిరపడేవారు తమ గ్రామ దేవత చిత్రపటం తమ ఇళ్ళలో పెట్టుకుని పుజించుకునేవారు. అలా తరతరాలుగా తమ గ్రామ దేవత ఉనికి తెలియబడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది గ్రామదేవతకు, ప్రకృతి మాతకు చేస్తున్న అపరాధం. భయంకరమైన అంటువ్యాధులను సైతం గ్రామ పొలిమేర దాటకుండా ఆపే అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు. ప్రతీ ఇంట్లో తమ గ్రామ దేవత చిత్రపటం తప్పకుండా ఉండాలి. తరువాతి తరానికి గ్రామదేవత శక్తి, విలువ తెలియజేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్రబలుతున్న అంటువ్యాధులు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇకనైనా మనం గ్రామదేవతలను అలక్ష్యం చేయక పుజించుకుందాం. ఆలోచించండి ... ఈ కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని అమ్మవారిని వేడుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: