మంచి మాట : అందరూ క్షమాగుణాన్ని అలవరచుకుంటే మంచిది..

Divya

క్షమా గుణానికి మంచి ఉదాహరణ మనం వృక్షాలను తీసుకోవచ్చు. ఎందుకంటే తన పైకి గురి చూసి రాయి విసిరినప్పటికీ, విసిరిన వాడికి అమృత ఫలాలను ఇచ్చే ఒక మంచి వృక్షము క్షమా గుణానికి నిలువెత్తు సాక్ష్యం.. మన్నించే మనసే ఉంటే, అది సామరస్యతకు సోపానం అవుతుంది. అనే ఈ నిజం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే , సామరస్యంతో కూడిన సమాజం ప్రారంభమవుతుంది.

జీవిత భాగస్వాములైనా,  సంతానమైనా,  బంధు మిత్రులైనా,  స్నేహితులైనా లేదా సన్నిహితులైన ఇలా అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమకు ఉంటే,  దానిని ఎప్పటికీ నిలిపి ఉండే గుణం క్షమాగుణం..
క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాపణ చెప్పే వారిలో మానసిక పరిపక్వత చెందిన వారిగా మనం భావించవచ్చు. క్షమాపణ అడగడం వల్ల అవతలి వారిలో అపరాధ భావం తొలగిపోయి, మానసిక ప్రశాంతత నెలకొంటుంది. క్షమాపణ అనేది మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. క్షమా గుణం ఉన్నవారు జీవితంలో అధిక శిఖరాలను చేరుకుంటారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. ఇక వీరిని జీవితంలో మహోన్నతులు గా పరిగణించవచ్చు.
ఇక సాధారణంగా బంధువులతో, జీవితభాగస్వామితో, సంతానంతో, స్నేహితులతో, తోబుట్టువులతో ఇలా ఎవరో ఒకరి చేత ఏదో ఒక కారణం చేత గొడవలు రావడం సహజం. అయితే కొంత మంది వాటిని మర్చిపోతే , మరి కొంతమంది ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొని , ఒకరికొకరు ముఖం చాటేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల నలుగురిలో గౌరవాన్ని కూడా కోల్పోతారు. ఇక గొడవ పడిన వారు ఎదురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడి , కోపం లేదా మానసిక ఆందోళన వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అదే కొద్దిగా ఓపిక తెచ్చుకొని క్షమాపణ చెప్పుకుంటే ,ఎవరికెవరు శత్రువులు కారు.. ఈ జీవితానికి ఏదీ శాశ్వతం కాదు.. పుట్టినప్పుడు ఏది తీసుకు రాము ..అలాగే చనిపోయినప్పుడు ఏది వెంట తీసుకెళ్లము. కాబట్టి బ్రతికి ఉన్నంతకాలం ప్రతి ఒక్కరితో సాన్నిహిత్యంగా బ్రతకడమే జీవితం.. ఈ సత్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో ఉంటారే తప్ప, ద్వేషాన్ని వారి మనసులో కి కూడా తీసుకు రానివ్వరు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: