మంచి మాట: ఏ పనికైనా ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు..!!

Divya
ఒక చిన్న ఊరిలో భీమయ్య అనే వ్యక్తి ఉండేవారు. ఆయనకి కొంత భూమి ఉండేది.. ఆ భీమయ్య గారి తోటలోని చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది. అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఒకరోజు కొడుకులతో కలిసి తోటకు వచ్చి "అయ్యో! చెట్లన్ని ఎండిపోయాయిరా!రేపు మన బంధువులను తీసుకువచ్చి ఈ చెట్లు కొట్టేసి కొత్త మొక్కలు నాటుదాం అన్నాడు.

 పిల్లలకి ఆహారం తేవటానికి బయటకి వెళ్ళిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు "అమ్మ! ఈ రోజు తోట యజమాని భీమయ్య కొడుకులు వచ్చారు. బంధువులను తెచ్చిరేపుఈ చెట్టుని కొట్టేస్తారట అని చెప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంది. మర్నాడు భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి "రేపు కూలీలను తెచ్చి ఈ చెట్టును కొట్టించేద్దాం !"అన్నాడు తల్లి తిరిగి రాగానే పిల్లపక్షులు ఇదే విషయం చెప్పాయి. తల్లి విని ఉరుకుంది. మూడోరోజు భీమయ్య కొడుకులతో వచ్చి రేపు స్నేహితులతో వచ్చి చెట్టు కొట్టేద్దాం!"అన్నాడు ఎప్పటిలాగానే తల్లి పక్షివిని ఊరుకుంది.
     
  నాలుగో రోజు మళ్లీ భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి "లాభం లేదురా! రేపు మనమే వచ్చి చెట్టుకొట్టేద్దాం! " అన్నాడు తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఈ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పక్షి పిల్లలను తీసుకొని వేరే చోటికి వెళ్లి అక్కడ చెట్టుమీద గూడు కట్టుకొని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు "అమ్మా! మొదటి రోజు ,రెండో రోజు, మూడో రోజు విని ఊరుకొని ఇప్పుడు తీసుకు వచ్చేసావేమి"అని అడిగాయి అందుకు తల్లి పక్షి బంధువుల మీద స్నేహితుల మీద  ఆధారపడితే వెంటనే పనులు కావు. ఎవరి పనులు వాళ్ళులే చేసుకోవాలనుకుంటేనే వెంటనే అయిపోతాయి అని చెప్పింది.
నీతి: ఇతరుల మీద ఆధారపడక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆ పనులు తప్పక అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: