మంచిమాట : కష్టించి పని చేయడాన్ని మించిన మంత్రదండం లేదు..!!

Divya
పూర్వం మాలవ రాజ్యాన్ని జయభద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మిక్కిలి సోమరి. ఎప్పుడు చదరంగం ఆడుతూ కూర్చోవటం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్టనష్టాలను గురించి పట్టించుకునే వాడు కాదు.
రాజు సోమరి కావడంతో ప్రజలందరూ సోమరులు గానే తయారయ్యారు. ఎవరు ఏ పని చేసేవారు కాదు.
దాంతో పంటలన్నీ ఎండిపోయాయి. రాజ్యమంతటా దరిద్రం విలయతాండవం చేయసాగింది .ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు.

అప్పుడు జయ భద్రుడు అరణ్యానికి వెళ్లి భగవంతుడిని గురించి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగానే నా రాజ్యంలో దారిద్రం పెరిగిపోయింది. ప్రజల కష్టాలు తీర్చడానికి నాకో మంత్రదండం కావాలి. అని ప్రార్థించాడు. వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమై పోయాడు.జయ భద్రుడు ఆనందంగా తిరిగి వచ్చి నావద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది ఎవరు ఏమి కోరుకుంటే అది ఇస్తాను.అని ఊరంతా చాటింపు వేయించాడు.

వూరిలోని ప్రజలందరూ విలవిలలాడుతూ రాజా సౌధం వద్దకు చేరుకున్నారు. రాజు భటులను పిలిచి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లను పిలుచుకు రండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్లగా ఒకచోట ఒక వ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు. భటులు కన్నెర్ర చేసి రాజు గారి ఆజ్ఞను దిక్కరిస్తావా అంటూ అతనిని రాజ్యసభకు  ఈడ్చుకొని వచ్చారు.కోరుకున్న వాళ్లకు కోరుకున్నంత మంత్రదండంతో ఇస్తానంటే..నువ్వు కట్టెలు కొట్టుకుంటున్నావే ఎందుకు అని రాజు ప్రశ్నించాడు.
అందుకు ఆ వ్యక్తి నవ్వి రాజా! నీ మంత్రదండం నా గొడ్డలే .. దీంతో కట్టెలు కొట్టి పొరుగూరికి తీసుకెళ్లి అమ్ముకొని అక్కడి నుంచి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను.
నాకు హాయిగా గడిచిపోతుంది . కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు. అన్నాడు వినయంగా..
అతని మాటలతో రాజు వాస్తవం గ్రహించాడు. తన చేతిలోని మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయమైపోయింది. ఆనాటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరి సంపదలతో తుల తూగ సాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: