మంచిమాట: అనాలోచితంగా చేసే పనులు ఎప్పటికైనా ప్రమాదాలు తెచ్చి పెడతాయి..!!

Divya
ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య , సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు.సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటకు తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. అయ్యా..! రామన్నగారు చూడండి. నా పామును ఇతడేలా భయంకరంగా చంపేశాడో ఇది ఇతనికి ఏ హాని చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు. అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య
"అతను చెప్పింది నిజమే ప్రభు! అదొక విష ప్రాణి.. చచ్చిపోయిన కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటకు వదిలేశాడు. అది నన్నేమి చేయలేదు కానీ ఎవరినైనా పొరపాటుగా దానీ దగ్గరకు వెళ్తే అది కాటేయక మానదు.. అందుకే దాన్ని చంపేశాను. అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి. అని వినయంగా చెప్పాడు రామయ్య.

పాము ప్రమాదకరమైనది.. సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటకు రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాదుకోవల్సింది. అంటూ మర్యాద రామన్న సోమయ్యకి సర్ది చెప్పబోయాడు.
మర్యాద రామన్న మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను..పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే ..నేరస్తులను మీరు శిక్షించకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చు పెరిగి పోతాయి. నేను ఇతన్ని వదలను.. నా పామును ఏ విధంగా చంపాడో..?  ఇతడిని కూడా అదే విధంగా చంపుతాను.. అన్నాడు ఆవేశంగా సోమయ్య..

సమస్యను ఎలా పరిష్కరించాలా..?  అని ఆలోచిస్తున్న మర్యాదరామన్నకు ఒక ఆలోచన తట్టింది. నీ పామును రామయ్య ఎలా చంపాడు. అని అడిగాడు రామన్న..
ఎలా చెప్పమంటారు.. దాని తోక పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరికొట్టాడు. అని చెప్పాడు సోమయ్య.
సరే నువ్వు కూడా అలాగే చంపు.. అతని తోక పట్టుకొని గాల్లోకి లేపి, గిరగిర నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పాడు.
సోమయ్య అయోమయంలో పడ్డాడు .. మనిషికి తోక ఉంటుందా..?  ఆ తోక పట్టుకొని గాల్లోకి తిప్పి చంపటం సాధ్యమేనా..?  ఇదసలు కుదిరే పని కాదు అన్నాడు.
అప్పుడు న్యాయాధికారి శాంతంగా అవును నిజమే మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం కాబట్టి నువ్వు నీ ఫిర్యాదును వెనక్కు తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పాడు రామన్న.
మర్యాదరామన్న ఇచ్చిన తీర్పు కి ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకొని తల వంచుకొని ఇంటికి వెళ్లిపోయాడు సోమయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: