పాపం.. నరసింహన్..

Chakravarthi Kalyan
గవర్నర్ గిరీ.. రాజకీయ నాయకులు..  పాలిటిక్సులో బాగా పండిపోయాక.. యాక్టివ్ పాలిటక్స్ నుంచి తప్పుకున్నాక అందుకునే పదవి. పేరుకు రాష్ట్రానికి అధిపతే తప్ప.. సాధారణంగా ఈయనకు చేయడానికి పని ఏమీ ఉండదు. అడపా దడపా సంతకాలు పెట్టడం.. గవర్నర్ హోదాలో పర్యటనలు చేయడం అంతవరకే. ఇందుకు మన మాజీ ముఖ్యమంత్రి రోశయ్యే ఓ ఉదాహరణ. 

కానీ అందరు గవర్నర్లకూ ఆ అదృష్టం ఉండదు. అలాంటి వారిలో ముందుంటారు మన ఉమ్మడి గవర్నర్ నరసింహన్. పాపం ఆయన ఏ ముహూర్తాన ఏపీకి గవర్నర్ అయ్యారో గానీ.. ఇటీవలి కాలంలో పట్టుమని పది రోజులు ప్రశాంతంగా ఉన్నది లేదు. ఎన్డీ తివారీ కామకేళీతో పదవి పోగొట్టుకున్న సమయంలో ఏపీ గవర్నర్ గా అడుగుపెట్టిన ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్.. కొన్నాళ్లపాటే ప్రశాంతంగా ఉన్నారు. 

గవర్నర్ కు ప్రశాంతత కరువైంది..


తెలంగాణ ఉద్యమం తిరిగిజోరందుకున్న దగ్గర నుంచి పాపం.. నరసింహన్ కు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని హ్యాండిల్ చేయడం.. ఆయన పెద్ద తలనొప్పే అయ్యింది.  ఆ సమయంలో ఏపీ నాయకులతో నరసింహన్ కుమ్మక్కయ్యారని తెలంగాణవాదులు బాగా అనుమానపడ్డారు. నేరుగానే విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు.. ఏకంగా ఆయనపై దాడి చేసినంతపని చేశారు. ఆయన ముందు పేపర్లు చింపారు. కుర్చీ లాగేశారు. మైకులు విరిచేశారు. 

పోనీ.. రాష్ట్రం విడిపోయిన తర్వాతైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనిచ్చారా అదీ లేదు. అంతకుముందు తెలంగాణ వాదులు.. ఇప్పుడు టీడీపీ నేతలు.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సెక్షన్ 8 అమలు చేయడం లేదని.. కేసీఆర్ చెప్పినట్టల్లా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆంధ్ర- తెలంగాణ పంచాయితీలతో ఢిల్లీకి హైదరాబాద్ కు తిరుగుతూ పాపం నరసింహన్ భలే ఇబ్బందిపడిపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి ఆయన నిత్యం పూజలు చేసే దేవుళ్లే కాపాడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: