బాబు - జగన్‌ అడ్రస్‌ గల్లంతే!

Chowdary Sirisha
తెలంగాణాలో టీడీపీ , వైకాపాలు ఆరిపోయే దీపాలని, ఈ నెల 30న జరగనున్న ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల నేతలు చంద్రబాబు, జగన్‌బాబులు తెలంగాణాలో ఇక కనపడరని టీపీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడ, మునగాల మండలాల్లోని గోండ్రియాల, చిమిర్యాల, దోరకుంట, రెడ్లకుంట, మునగాల మండల కేంద్రంలోఉత్తమ్‌ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని, వారిని నమ్మవద్దన్నారు. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్చిన ఘనత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా తనదేనన్నారు. గోండ్రియాల గ్రామంలో కోట్ల రూపాయలతో సబ్‌స్టేషన్లు, వంతెనలు, సీసీ, బీటీ రోడ్లు నిర్మించిన ఘనత తనదేనన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోక పోతే ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అనంతరం చిమి ర్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ పాల్గొని మాట్లాడారు. చిమిర్యాలలో చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోవద్దని కోరారు. అనంతరం దోరకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఐదేళ్ళలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎంపీగా గుత్తా సుఖేందర్‌రెడ్డికి, ఎమ్మెల్యేగా పద్మావతిరెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్లకుంట గ్రామానికి చెందిన వైపాపా నాయకుడు వంకాయలపాటి శ్రీనివాస్‌తో పాటు 20 కుటుంబాలు, మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన సర్పంచ్‌ 200 మంది కార్యకర్తలతో మంత్రి సమక్షం లో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కోదాడ పట్టణంలో బ్రాహ్మణ కులస్తులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మావతిరెడ్డికి మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం అనంతగిరి గ్రామానికి చెందిన తీగల శ్రీనివాసరావు, చామలేటి సాంబయ్య, ఇటీవల పదవీ విరమణ చేసిన కెఎల్‌ నర్సింహారావులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుంకర మల్లేష్‌గౌడ్‌, ముత్తవరపు పాండురంగారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వల్లూరి రామిరెడ్డి, వంగవేటి రామారావు, డేగ బాబు, కొత్తా గురవయ్య, జడ్‌పీటీసీ అభ్యర్థి ధారావత్‌ ధనలక్ష్మీ, గుడిపూడి శ్రీకాంత్‌, కనగాల నర్సింహారావు, పాలకి అర్జున్‌, మాగి యాకోబ్‌, కొండపల్లి వాసు, కొమరగిరి రంగారావు, రామానుజరావు, సుధాకర్‌ రావు, అక్కిరాజు వెంకట్రావు, సింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: