వైఎస్ జ‌గ‌న్‌ వేగానికి కేంద్రం స్పీడ్-బ్రేక్!

విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఎప్పటికీ  ప్రయోజనమే. కానీ అవే నిర్ణయాలపై ఎవరి ప్రొద్భలమో, లేక కక్ష తోనో, పగతోనో, అనాలొచితంగానో, అధికారంలో ఉన్నాం క‌దా! అని తీసుకుంటే అవే అప్రతిష్టకు దారితీస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డంలో తొందరపాటు జరిగితే అప్రతిష్ట ఎటు నుంచి దూసుకు వస్తుందో కూడా అర్ధం కాదు. అయితే కొత్త నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం లోనూ, పాత నిర్ణయాలను పాతర వేయడం లోను ఈ దోర‌ణి ఆహ్వానించ‌ తగ్గది మాత్రం  కాదు.

 


ఏపీ ముఖ్య‌మంత్రి, కొత్తగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టినా వైఎస్ జగన్మోహనరెడ్డి తన పాలననను వ్యూహాత్మకంగానే నడిపిస్తున్నారు. అందులో అనుమానం ఇసుమంతైనా లేదు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ల కొంతైనా శ‌త్రుత్వంవ‌ల్ల సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని కొత్త సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటన చేశారు.

 

ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు స్వీక‌రించింది మొద‌లు గత ప్రభుత్వ నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డం, మార్పుచేయటం, ఉప‌సంహ‌రించ‌డం అనే కార్య‌క్ర‌మంలో వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనికి కారణం గత ప్రభుత్వం మొత్తం అవినీతి మయమని జనం విశ్వసించటమే. ఆది నిజమేనన్నట్లు ఆ ప్రభుత్వం నడిపిన టిడిపి ప్రజాక్షేత్రంలో పునాదుల్లొకి కూలిపోవటమే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వైఎస్ జగన్ చంద్ర‌బాబు సీఎంగా ఉన్నసమయంలో చేసుకున్న  విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ప్రక‌టించారు.

 

అయితే, దీనిపై కేంద్రం స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃపరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడి దారుల నమ్మకాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు వెనుకాడే అవకాశం ఉందని స్ప‌ష్టం చేసింది. ఒప్పందాల్లో ఏదైనా కుట్ర జరగడం లేదా అందులోని వ్యక్తులకు మితిమీరిన లబ్ధి చేకూరిందని ఋజువైతే తప్ప ఒప్పందాలను పునఃపరిశీలన లేదా సమీక్షలు చేయరాదని కేంద్రం తన లేఖలో స్పష్టం చేసింది.


ఆ లేఖను ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద కుమార్ రాశారు. మితిమీరిన ల‌బ్ధి చేకూరింద‌ని ఋజువు  కానీ పక్షంలో గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్’  నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అది కూడా బహిరంగ వేలం ప్రక్రియలో సాగుతాయని గుర్తుచేసింది.

 

2022నాటికి 175గిగా వాట్ల పునరుత్పాధకశక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇందనశాఖ గుర్తుచేసింది. ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలు పై పునఃపరిశీలన జరపడం సరికాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించిందని సమాచారం.

 

అయితే నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇది ఒక అనుభవం మాత్రమె. ఈ మాత్రానికే పాత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించటం మానకూడదు. అందులో అవినీతి జరిగినట్లు పక్కాగా రూడీ అయిన పక్షంలోనే నిపుణుల పర్యవేక్షణలో అంతర్గత విచారణ జరిపి మాత్రమే, ప్రకటనలు చేయవలసిన అవసరం ఉంది. అందుకు తగిన జాగ్రత్తలు ప్రతి అడుగులోనూ తీసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: