ఎడిటోరియల్ : చంద్రబాబు ఓటు వైసిపికి పడిందా ?

Vijaya

రాష్ట్రమంతా ఇపుడిదే చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు ఓటు మీద ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది ?  ఎందుకంటే, తన ఓటు విషయంలో స్వయంగా చంద్రబాబే అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి. ఈవిఎంల ట్యాంపరింగ్ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ తానేసుకున్న ఓటు తనకే పడిందా ? తన ఓటు సైకిల్ గుర్తుకే పడిందా ? అన్న అనుమానం వచ్చినట్లు చెప్పారు లేండి.

 

అసలా అనుమానం చంద్రబాబుకు ఎందుకొచ్చింది ? ఎందుకొచ్చిందంటే, ఈవిఎంల్లో ఎవరు సైకిల్ కు ఓట్లేసినా అన్నీ ఫ్యాను గుర్తుకే పడుతోందనే ప్రచారం జరుగుతోందని సెలవిచ్చారు లేండి. టెక్నాలజీని ప్రపంచానికి తానే పరిచయం చేశానని చెబుతుంటారు. దేశంలో అసలు ఈవిఎంల వినియోగం తనవల్లే మొదలైందని కూడా ఒకపుడు చెప్పుకున్నారు. అలాంటిది ఇపుడు అదే చంద్రబాబు ఇదే ఈవిఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది.

 

అసలిదంతా ఎందుకు మొదలైందంటే ? ఓటమి భయమని వైసిపి నేతలు చంద్రబాబును ఎకసెక్కాలు చేస్తున్నారు. చంద్రబాబులో ఓటమి భయం పెరిగిపోతోందన్నారు. ఓటమి బాధ్యతను ఎవరో ఒకరిపై నెట్టేయటం చంద్రబాబుకు అలావాటే కాబట్టి ఇపుడు ఈవిఎంలను సాకుగా చూపిస్తున్నట్లు వైసిపి నేతలంటున్నారు.

 

ఏదేమైనా టెక్నాలజీ పితామహుడు చంద్రబాబే సాంకేతికతను తప్పుపట్టటాన్ని మాత్రం జనాలు హర్షించటం లేదు. అందుకనే ఈవిఎంలను చంద్రబాబు తప్పపట్టటాన్ని మతిభ్రమంచటం క్రింద చెప్పుకుంటున్నారు. చంద్రబాబులో ఓటమి భయం అయినా మొదలయ్యుండాలి లేకపోతే మతన్నా భ్రమించి ఉండాలంటూ జనాలు బాహాటంగానే అనుమానిస్తున్నారు. తమ ఓటు తామే వేసిన వారికే పడిందంటున్నారు జనాలు. పైగా వివిప్యాట్ కూడా కనబడుతుంది కదా ? అంటూ లా పాయింట్ కూడా లాగుతున్నారు.

 

తామేసిన ఓట్లు తామేసిన పార్టీకి పడినపుడు, వివి ప్యాట్ లో స్లిప్ కూడా కనిపించినపుడు ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఎందుకు ఆ అనుమానం వచ్చిందని నిలదీస్తున్నారు. పైగా చంద్రబాబుకు వచ్చిన అనుమానం ఆయన కుటుంబసభ్యుల్లో ఇంకెవరికీ రాలేదన్న విషయాన్ని కూడా జనాలు గుర్తు చేస్తున్నారు. 15 ఏళ్ళు సిఎంగాను, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగాను పనిచేసిన చంద్రబాబు రచ్చబండ దగ్గర పోచికోలు కబుర్లు చెప్పుకునే వాళ్ళు మాట్లాడుకున్నట్లు మాట్లాడటం ఏమీ బావోలేదని కూడా అంటున్నారు. మరి చంద్రబాబు ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవాలంటే మే నెల 23 వరకూ వెయిట్ చేయాల్సిందే తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: