హాట్‌సీట్‌: ఏపీలో ఊరంతా ఒక దారి... ఆ నియోజకవర్గం ప్రజలది మ‌రోదారి.... పిఠాపురంలో కొత్త సెంటిమెంట్‌

VUYYURU SUBHASH
ఊరంతా ఒక దారైతే వాళ్లది మరొక దారి అన్న చందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ఓటరు పరిస్థితి. రాష్ట్రమంతా ఒక తీర్పు చెబితే పిఠాపురం ఓటరు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తుంటారు. గత నాలుగు ఎన్నికల నుంచి ఇక్కడ ఓటరు ఇదే తర‌హా తీర్పు ఇస్తున్నారు. నాలుగు ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తున్న సెంటిమెంట్‌ ఈ సారి కూడా రిపీట్‌ అవుతుందా? ఈ ఎన్నికల్లో పిఠాపురం ఓటరు ఎవరికి పట్టం కడుతూ తీర్పు ఇస్తున్నాడు అన్నది అంచనాలకు అందడం లేదు. 2004లో బీజేపీ, 2009లో ప్ర‌జారాజ్యం, గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్రులు ఇక్క‌డ గెలివ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తాజా ఎన్నికల్లో పిఠాపురంలో పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నా ప్రధాన పోటీ త్రిముఖంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఎస్వీ.ఎస్‌.ఎన్‌ వర్మ, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన నుంచి కాకినాడ కార్పొరేషన్‌ టీడీపీ కార్పొరేటర్‌ మాకినీడి శేషుకుమారి మధ్య‌ ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మేడిద వెంకటశ్రీనివాసరావు, బీజేపీ అభ్యర్థిగా బల్లకుర్తి రామేశ్వరరెడ్డి పోటీలో ఉన్నా వీరిద్దరి పోటీ నామా మాత్రమే.

 
నియోజకవర్గంలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య‌  ఉన్నా ఇక్కడ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కుల సమీకరణలే కీలకం కానున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వర్మ గత ఎన్నికల్లో పార్టీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 48,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే టీడీపీ కండువా కప్పుకున్నారు. చివరి నిమిషమంలో సీటు రాలేదన్న సానుభూతి ఆయనకు కలిసి రావడంతో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో వర్మపై ఉన్న సానుభూతి పవనాలు ఈ ఎన్నికల్లో లేవు. పైగా నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజికవర్గం వర్మపై ఒకింత కినుక వహించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లలో అభివృద్ధి విషయంలో వర్మ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, సామాజిక భవనాలు, ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనులు, లైటింగ్‌ హౌసింగ్‌ వంటి వాటిపై దృష్టి సారించి ప్రజల్లోకి కొంత వరకు చొచ్చుకుపోయారు. అదే టైమ్‌లో ఐదేళ్లలో ఆయన తీసుకున్న కొన్ని వివాస్పద నిర్ణయాలతో పాటు, నియోజకవర్గంలో మెజారిటీ వర్గంగా ఉన్న కాపుల్లో ఆయనపై కొంత వరకు వ్యతిరేఖత ఉండడం మైనెస్‌. ఇదే ఇక్కడ ఇప్పుడు ప్రత్యర్థికి అనుకూలంగా మారుతున్నట్టు చర్చ నడుస్తోంది. 


ఇక వైసీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు 2004లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీలోకి జంప్‌ చేసి ఓడిపోయారు. ఓడినా ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్మపై ఉన్న వ్యతిరేఖతే దొరబాబు తన ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. వివాద‌ రహితుడు కావడం కూడా ఆయనకు కలిసిరానుంది. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి వంగా గీత గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమె వర్గం ఇప్పుడు దొరబాబుకు బలంగా సపోర్ట్‌ చేస్తోంది. దీనికి తోడు వైసీపీ ఫ్యాన్‌ గాలి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉందన్న టాక్‌ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు దొరబాబుకు తిరుగులేని సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఇక కాపు ఉద్య‌మ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో సహజంగా ఇక్కడ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎక్కువ. 


2009 ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థి ఇక్కడ వంగా గీత గెలుపును సైతం గుర్తించుకోవాల్సిన విషయం. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. చివరకు సమీకరణల నేపథ్యంలో కాకినాడ కార్పొరేటర్‌ మాకినేని శేషు కుమారికి పవన్‌ సీటు ఇచ్చారు. స్థానికులకు సీటు ఇవ్వలేదన్న అసంతృప్తి కొంత ఉన్నా అది పవన్‌ వీరాభిమానులు, జనసైనికుల్లో లేదు. పవన్‌ ఎవరికి సీటు ఇచ్చినా తాము గెలిపించుకుంటామని జనసైనికిలు చెబుతున్నారు. కాపుల ఓటు బ్యాంకు, పవన్‌ అభిమానలు ఎక్కువగా ఉండడంతో శేషు కుమారి ప్రచారంలో దూసుకుపోతున్నారు.కాకినాడలో కార్పొరేటర్‌గా ఉన్న శేషుకుమారి హఠాత్తుగా పిఠాపురంలో పోటీకి దిగడంతో ప్రచారంలో కాస్త ఆలస్యం అయినా పవన్‌ ఇమేజ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఏదేమైన జనసేన గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను మాత్రం తారుమారు చెయ్యడం ఖాయం. మ‌రి ఈ సారి అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌రు స్టేట్‌లో గెలిచిన పార్టీని గెలిపిస్తాడా ?  లేక స్టేట్ తీర్పుకు భిన్న‌మైన తీర్పు ఇస్తాడా ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: