ఎడిటోరియల్ : చంద్రబాబుపై మండిపోతున్న కోడెల

Vijaya

అవసరానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబానాయుడుకి మించినోడు లేడనేందుకు తాజగా మరో ఉదాహరణ బయటపడింది. ఐదేళ్ళపాటు కోడెలను అడ్డంగా వాడేసుకున్న చంద్రబాబు ఇపుడు టికెట్ విషయంలో మాత్రం దాదాపు మొండిచెయ్యే చూపించేట్లున్నారు. అంతేకాకుండా సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేక గ్రూపును తెరపైకి తెచ్చారనే ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది. నియోజకవర్గంలో జరుగుతున్నదంతా కోడెలకు టికెట్ ఎగ్గొట్టేందుకే అనే ఆరోపణలు చంద్రబాబుపై పెరిగిపోతోంది. 

 

నిజానికి  అసెంబ్లీ స్పీకర్ గా కోడెల ఎంపికైనా ఏనాడు అందరి సభ్యులను ఒకేలా చూడలేదు. స్పీకర్ గా ఎంపికవ్వటంలో ప్రధాన ప్రతిపక్షం వైసిపి పూర్తిగా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే కోడెల మాత్రం అందరు ఎంఎల్ఏలను ఒకేలాగ చూడకుండా తాను టిడిపి నేతనే అని చాలా సార్లు స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారు.

 

వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు 23 మంది టిడిపిలోకి ఫిరాయించినా వారిపై చర్యలు తీసుకోలేదు.  వారిపై అనర్హత వేటు వేయమని జగన్మోహన్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినా కనీసం పట్టించుకోలేదు. సరే ఆ సంగతలా ఉంచితే టిడిపి, ఫిరాయింపు ఎంఎల్ఏలు కావాలనే జగన్ ను వ్యక్తిగతంగా దూషించినా ఏనాడు వారిని వారించిన పాపాన పోలేదు. కోర్టులో విచారణలో ఉన్న జగన్ కేసులను మంత్రులు, ఎంఎల్ఏలు ప్రస్తావించి కావాలనే అమ్మనాబూతులు తిడుతున్నా కోడెల మౌనంగానే ఉన్నారు.

 

అదే సమయంలో జగన్ కానీ లేకపోతే వైసిపి ఎంఎల్ఏలు కానీ ఏదేనా సమస్యలపై చంద్రబాబును నిలదీసిన సమయంలో మాత్రం మైక్ ను వెంటనే కట్ చేసేవారు. జగన్ మాట్లాడుతున్నపుడు టిడిపి ఎంఎల్ఏలు అడ్డుపడుతున్నా పట్టించుకోలేదు. ఇక రోజా సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన ఘనత కోడెలది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభ్యుడు అనుచితంగా ప్రవర్తించారని తేలితే ఆ సెషన్ వరకూ మాత్రమే సస్సెండ్ చేయాలి.  రోజా సస్పెన్షన్ చెల్లదని స్వయంగా హై కోర్టు చెప్పినా కోడెల పట్టించుకోలేదు.

 

అసెంబ్లీ సమావేశాలపుడు వైసిపి ఎంఎల్ఏలను సస్పెండ్ చేశారు. విచిత్రమేమిటంటే సభలోని లేని సభ్యులను కూడా కోడెల సస్పెండ్ చేశారు. సభలో లేని తమను ఏ విధంగా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినా కోడెల ఏనాడు సమాధానం చెప్పలేదు. ఫిరాయింపు ఎంఎల్ఏ అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకోమని కోర్టు ఆదేశించినా లెక్క చేయలేదు.

 

రాబోయే ఎన్నికల్లో కోడెలను చంద్రబాబు నరసరావుపేట ఎంపిగా పోటీ చేయాలని ఆదేశించారు. అందుకు కోడెల ఇష్టపడకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి అసెంబ్లీకే పోటీ చేస్తానని చెబుతున్నారు. సత్తెనపల్లిలో కోడెలకు టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరట. పైగా సత్తెనపల్లిలో కోడెలకు టికెట్ ఇవ్వద్దంటూ నేతలు చేస్తున్న గోల వెనక చంద్రబాబు, చినబాబే ఉన్నారని పార్టీలో ప్రచారం మొదలైంది. మరి కోడెల ఇపుడేం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: