టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా మళ్ళీ ఎగురుతుందా...!

VUYYURU SUBHASH
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట...టీడీపీ ఆవిర్భావం నుండి మొన్నటివరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. ఇక 1989లో కాంగ్రెస్, 2014లో వైసీపీ విజయం సాధించాయి.అయితే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి కంచుకోటని దక్కించుకోవాలని టీడీపీ చూస్తుంటే....ఈసారి కూడా టీడీపీ కంచుకోటలో తమ జెండా ఎగరవేయాలని వైసీపీ చూస్తోంది. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఉన్నారు. నాని 2004, 09లో రెండు సార్లు టీడీపీ నుండి, ఒకసారి 2014లో వైసీపీ నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా వరుసగా మూడు సార్లు గుడివాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హ్యాట్రిక్ కొట్టిన నాని…నాలుగోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తోన్నారు. రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ కంటే వ్యక్తిగత ఇమేజ్ మీద గెలిచే నేతల్లో నాని ఒకరు.  ఇలాగే టీడీపీకి కంచుకోటగా ఉండే గుడివాడని తన ఇమేజ్‌తో వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. 


ఈ నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా ఉన్న నానికి...యూత్‌లో మంచి పట్టుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లు నానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. మరోవైపు నానికి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో…ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కొందరు నానికి మద్ధతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అలాగే దురుసుతనంగా మాట్లాడటం లాంటివి నానికి మైనస్ అనే చెప్పాలి. మరోవైపు కంచుకోటని ఎలా అయిన దక్కించుకోడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుని తప్పించి.... దివంగత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌ని నానిపై పోటీకి దింపారు.


ఇటీవలే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడుగా ఎంపిక అయిన అవినాష్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక టీడీపీ ప్రభుత్వం గుడివాడ నియోజకవర్గంలో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ బాగానే అమలు అయ్యాయి. ఇక్కడ ముందు నుండి ఉన్న క్యాడర్ టీడీపీకి అదనపు బలం. అయితే విజయవాడ నుండి వచ్చిన అవినాష్ గుడివాడలో ఏ మేరకు రాణించగలరు అనేది చూడాలి. పైగా ఇప్పుడు టిక్కెట్ నిరాకరింపబడ్డ స్థానిక నేతలు ఆయనకు పూర్తిగా సహకరిస్తారా లేదా అనేది కీలక అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: