మార్చి 14న మరో భారీ బహిరంగ సభ నిర్వహించి సంచలనం సృష్టించబోతున్న పవన్..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీని స్థాపించాను అని కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి ప్రముఖ పాత్ర పోషించారు.


అయితే కొన్ని అనివార్య కారణాల వలన గత ఏడాది మార్చి లో గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వచ్చి రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని పటిష్ట పరుస్తూ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు.


ఈ క్రమంలో మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు జనసేన పార్టీ నాయకులు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ నిర్వహించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.


విశాలమైన ఈ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ ప్రతినిధులు తలమునకలై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సభలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని, అందరికీ ఇదే తన ఆహ్వానమని పేర్కొన్నారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పదిహేను మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభ ప్రతి ఓటర్ ని ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: