ఎడిటోరియల్ : ‘అనంత’ టిడిపిలో ముసలం తప్పదా ?

Vijaya

అలాగే ఉంది పరిస్ధితి చూడబోతే. లోక్ సభ పరిధిలోని సిట్టింగులందరినీ పోటీకి చంద్రబాబునాయుడు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఒకళ్ళపై మరొకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.  అనంతపురం లోక్ సభ పరిధిలోని ఎంఎల్ఏలతో ఎంపి జేసి దివాకర్ రెడ్డికి ఏమాత్రం పడటం లేదు. అదే విధంగా ఎంపి అంటేనే చాలామంది ఎంఎల్ఏలు మండిపోతున్నారు. ఎంపిపై ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలపై ఎంపి చంద్రబాబునాయుడు దగ్గరే ఫిర్యాదులు చేసుకున్నారు.

 

ఒకళ్ళపై మరొకళ్ళ ఫిర్యాదుల పర్వం అయిపోయిన తర్వాత  లోక్ సభ పరిధిలోని ఎంఎల్ఏలను మార్చాల్సిందేనంటూ జేసి బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. అయితే జేసికి మళ్ళీ ఎంపిగా అవకాశం ఇస్తే ఓటమిఖాయమంటూ ఎంఎల్ఏలు కూడా చంద్రబాబుతో చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఎంపి-ఎంఎల్ఏ అభ్యర్ధుల మధ్య ఎంతటి వైరం ఉందో చెప్పటానికే.

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కద. అందుకనే అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. ఇటు ఎంపి అభ్యర్ధిని మార్చలేదు. అటు ఎంఎల్ఏలను మార్చేది లేదని చెప్పేశారు. అలాంటిది ఎవరి సీట్లలో మళ్ళీ వాళ్ళనే పోటీ చేయమని చంద్రబాబు చెప్పారంటే వారిమధ్య సమన్వయం ఎంత దివ్యంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు.

 

జేసికి అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర చౌధరి మధ్య పరిస్ధితులు ఉప్పు నిప్పు. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులంటే జేసికి పడదు. ఇక్కడ తన మేనల్లుడు దీపక్ రెడ్డికి టికెట్ తెచ్చుకోవాలని జేసి అనుకుంటే పడలేదు. పుట్టపర్తిలో తన మద్దతుదారుల్లో ఒకరికి టికెట్ తెచ్చుకోవాలని ఎంపి అనుకుంటే మళ్ళీ పల్లె రఘునాధరెడ్డే పోటీ చేస్తున్నారు. గుంతకల్లులో తన మద్దతుదారుడైన మధుసూధనగుప్తాను పోటీ చేయించాలని జేసి ప్రయత్నించారు. కానీ చంద్రబాబేమో సిట్టింగ్ ఎంఎల్ఏ జితేంద్రగౌడ్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

శింగనమల నియోజకవర్గంలో మళ్ళీ సిట్టింగ్ ఎంఎల్ఏ యామినీబాల పోటీ చేయటం జేసికి ఏమాత్రం ఇష్టం లేదు. తన వాళ్ళలో ఎవరికైనా టికెట్ తెచ్చుకుందామనుకుంటే కుదరలేదు. కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌధరికి టికెట్ ఇవ్వటం జేసికి ఇష్టం లేకపోయినా మాట్లాడలేకపోయారు. తాడిపత్రిలో తమ్ముడి కొడుకు జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉరవకొండలో ఎంఎఎల్సీ పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు. అంటే ఏడు అసెంబ్లీల్లో ఐదుచోట్ల జేసి వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: