ఎడిటోరియల్ : నిజాయితీగానే హామీలిద్దాం..హామీల్లో పోటీ అవసరం లేదు

Vijaya

రాబోయే ఎన్నికల్లో భాగంగా జనాలకు ఇస్తున్న హామీల్లో నిజాయితీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకోసం ఎటువంటి హామీలివ్వాలి అనే విషయాలను ఫైనల్  చేయటానికి ఈరోజు మ్యానిఫెస్టో  కమిటీతో జగన్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చే హామీల్లో నిజాయితీ ఉండాలని గట్టిగా చెప్పారు. హామీలివ్వటంలో ఏ పార్టీతోను పోటీ పడాల్సిన అవసరం లేదన్నారు. పైగా తమ హామీలను ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్న విషయాలను ప్రజలకు అర్ధమయ్యేట్లు ఉండాలని కూడా చెప్పారు.

 

ఎన్నికలన్నాక జనాలను ఆకట్టుకునేందుకు పార్టీల అధినేతల ఎన్నో హామలిస్తుంటారు. ఇచ్చిన హామీలన్నీ ఆచరణ యోగ్యమైనవా ? కాదా ? అన్న విషయాలను చాలామంది జనాలు పట్టించుకోరు. ఓ పార్టీకి ఓటు వేయాలన్నా వద్దనుకున్నా ఇతరత్రా విషయాలు ప్రభావితం చేయటం మామూలే. మ్యానిఫెస్టో చూసి జనాలు ఓట్లేసే రోజులు మనదేశంలో లేవనే చెప్పాలి. పైగా మ్యానిఫెస్టో అమలు చేయకపోతే నిలదీసే జనాలు కూడా లేరు. అందుకే మ్యానిఫెస్టోకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబానాయుడు ఇచ్చిన మ్యానిఫెస్టోనే నిదర్శనం.

 

పోయిన ఎన్నికల్లో 600 హామీలిచ్చిన జగన్ అందులో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇచ్చే హామీల్లో నిజాయితీ ఉండాలని అంటున్నారు. నిజానికి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు  చేయటం కూడా అంత ఈజీకాదు. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేయటం మామూలు విషయం కాదు.


మ్యానిఫెస్టో రూపకల్పనలో పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని జగన్ స్పష్టంగా ఆదేశించారు. ప్రతీ హామీని అమలు చేయాల్సిందేనంటున్నారు జగన్. కౌలు రైతుల అభివృద్ధి, పేద విద్యార్ధుల చదువులకు ఇచ్చిన హామీ, పిల్లల్ని బడికి పంపేందుకు ఇచ్చిన హామీ, వృద్ధులు, వికలాంగులు, జాలర్లకు ఫించన్ హామీ, సామాజికవర్గాల వారీగా ఇచ్చిన హామీల్లాంటివి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాల్సిందనంటున్నారు జగన్.

 

నిజానికి లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటున్నారు సరే. కానీ వాటి అమలుకు అవసరమైన నిధుల సమీకరణను ఏ విధంగా చేస్తారన్న విషయంలో ఎవరి అనుమానాలు వారికున్నాయి. రాష్ట్రమేమో అప్పులకుప్పగా మారిపోయింది. ఆర్దికసాయం చేసే వాళ్ళు కూడా లేరు. బడ్జెట్ పెంచుకుంటు పోయినంత మాత్రాన ఉపయోగం లేదు. ముందు దుబారా ఖర్చు తగ్గించి, ఆదాయాలు పెంచుకుంటే కానీ రాష్ట్ర ఆర్దిక పరిస్దితి బాగుపడదు. ఆపని ఐదేళ్ళల్లో సాధ్యం అయ్యే పనికాదు. అధికారంలోకి వచ్చినా తన హామీలను జగన్ ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: