కడపలో ఈసారి కత్తులు దూయడం ఖాయం..!?

Vasishta

ఎలక్షన్స్ అంటే చాలు కచ్చితంగా గుర్తొచ్చే పేరు కడప. కడపలో ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ వై.ఎస్. కుటుంబానిదే ఆధిపత్యం అయినా ప్రత్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ వై.ఎస్. కంచుకోటను బద్దలు కొట్టాలనుకుంటోంది. అందుకే గట్టి ప్రత్యర్థులను రంగంలోకి దించుతోంది.


ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ సొంత జిల్లా కడపపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపికను కడప జిల్లా నుంచే ప్రారంభించారంటే ఆ జిల్లాపై చంద్రబాబు ఎంతటి శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. పైగా అసంతృప్తులను బుజ్జగించి ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకు ముందుగానే అభ్యర్థులను రెడీ చేసేశారు.


కడప జిల్లాలో రాజకీయాలను ములుపు తిప్పేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క బలమైన ప్రత్యర్థి పార్టీ.. మరో పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య కీచులాటలు... వేధిస్తున్నా సీఎం పట్టుదలగా ముందుకెళ్తున్నారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి టికెట్ కేటాయించారు. మంత్రి ఆది నారాయణ రెడ్డికి, రామసుబ్బారెడ్డికి మధ్య దశాబ్దాల వైరం ఉంది. వాటిని పక్కన పెట్టి రెండు కుటుంబాలూ ఒక్క తాటిపైకి వచ్చాయి. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి బరిలో దిగనున్నారు. వీరిద్దరూ కలసి పని చేస్తే జమ్మలమడుగులో విజయం ఖాయమనేది స్థానికుల మాట.


కమలాపురం అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి పేరు ఖరారైంది. ఇదే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా ప్రయత్నించారు. పుత్తా నరసింహారెడ్డికి నియోజకవర్గంలో మంచి కేడర్ ఉంది. అయితే ఆయన వర్గీయులు దూకుడుగా వ్యవహరిస్తారనే పేరుంది. వీరశివారెడ్డి మీద కూడా నియోజకవర్గంలో సానుకూలత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుండడం ఆయనకు ప్లస్ పాయింట్. అయితే ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో టికెట్ పక్కన పెట్టారు. వీరశివారెడ్డి, పుత్తా సహకరించుకుని ముందుకెళ్తే కమలాపురంలో తిరుగుండదు. ఇక్కడ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో దిగనున్నారు.


మైదుకూరులో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో దిగనున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడుకు ఈయన వియ్యంకుడు. బీసీల్లో మంచి ఆదరణ ఉంది. అయితే నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఆయనకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో డి.ఎల్. వర్గం సహకరించకపోవడంతో పుట్టా సుధాకర్ యాదవ్ ఓడిపోయారు. ఈసారి కూడా డి.ఎల్. వర్గం సహకరిస్తుందనే నమ్మకం లేదు. ఇక్కడ రఘురామిరెడ్డి వైసీపీ తరపున బరిలో దిగుతున్నారు.


ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాలపై టీడీపీలో ఇంకా క్లారిటీ లేదు. కడపలో మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్ ను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ప్రొద్దుటూరులో బీసీ నేతకు సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ పార్టీకి చేటు చేస్తోంది. పులివెందులలో వై.ఎస్. జగన్ పై సతీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఓవరాల్ గా రెండు నియోజకవర్గాల్లో తప్ప కడప పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: