ఎడిటోరియల్ : చీఫ్ జస్టిస్ తో చంద్రబాబు భేటీపై అనుమానాలు

Vijaya

అవును 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని రోజు చెప్పుకునే చంద్రబాబునాయుడును ఇపుడు అందరు అనుమానిస్తున్నారు. తనను జనాలు అనుమానించే పరిస్ధితులను చంద్రబాబే చేతులారా తెచ్చుకున్నారు. చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసును ప్రభావితం చేయటటానికే అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్రప్రభుత్వం జ్యుడీషియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఇది కూడా తాత్కాలికమే అయినా వచ్చే నెలలో ప్రారంభమవుతోంది.

 

కాంప్లెక్స్ భవనం ప్రారంభోత్సవానికి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ను ఆహ్వానించటానికి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళారు. చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించటంలో తప్పేమీ లేకపోయినా స్వయంగా చంద్రబాబే వెళ్ళటంతో ఆరోపణలు మొదలయ్యాయి. ఎందుకంటే, జగన్ పై హత్యాయత్నం కేసు చంద్రబాబు అండ్ కో చుట్టూ బిగుసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం అందరు గమనిస్తున్నదే.

 

అయితే, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసు విచారణలో స్టే దొరకటం లేదు. హత్యాయత్నం కేసు విచారణ నుండి ఎన్ఐఏ ను తప్పించాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. చంద్రబాబు ప్రతీ ప్రయత్నాన్ని హై కోర్టు కొట్టేస్తోంది. ఒకటికి రెండుసార్లు రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టేస్తున్న మళ్ళీ మళ్ళీ ఏదో ఓ రూపంలో రాష్ట్రప్రభుత్వం ఎన్ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు ఢిల్లీలో చీఫ్ జస్టిస్ ను కలవటం ఏమిటి ? చీఫ్ జస్టిస్ ను ప్రభావితం చేయటం ద్వారా ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 

వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంలో అసలే చంద్రబాబు గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. అందునా న్యాయవ్యవస్ధపై చంద్రబాబు పట్టు గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. తనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరగనీయకుండా చంద్రబాబు ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో నమోదైన కేసులను పక్కన పెట్టినా అందరికీ గుర్తుండే ఓటుకునోటు కేసు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నమోదైన ఏ కేసైనా కానీవ్వండి అసలు విచారణ అర్హతే లేదని అడ్డంగా వాదిస్తుంటారు చంద్రబాబు. నిజంగా అదృష్టం కొద్దీ ప్రతీ కేసులోను చంద్రబాబుపై విచారణ జరగకుండా స్టేలు దొరుకుతున్నాయి. అంతమాత్రానికే తాను నిప్పునంటూ బిల్డప్ లు ఇస్తుంటారు.

 

నిజం చెప్పాలంటే చంద్రబాబుకు మొట్టమొదటిసారి జగన్ కేసులోనే ఎదురుదెబ్బ తగిలింది. అంటే ఈ కేసులో అంతలా అడ్డంగా బుక్కైపోయారన్నమాట. కేసును సిట్ విచారించినంత కాలం టిడిపి నేతలు చాలా కులాసాగానే ఉన్నారు. ఎప్పుడైతే కేసు విచారణను హై కోర్టు ఎన్ఐఏకి అప్పగించిందో అప్పటి నుండే చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ఐఏ విచారణ గనుక స్పీడుగా జరిగితే టిడిపిలోని కీలక నేతలు చాలామంది తగులుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబు-చీఫ్ జస్టిస్ భేటీపై అందుకే అనుమానాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: