ఎడిటోరియల్ : బికాంలో ఫిజిక్స్ కు మొండిచెయ్యి..ఓవర్ యాక్షనే కారణమా ?

Vijaya

బికామ్ లో ఫిజిక్స్ చదివిన ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ గుర్తున్నారా ? రాబోయే  ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎంఎల్ఏకి పెద్ద షాకే ఇచ్చారు. పోయిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి జలీల్ ఖాన్ వైసిపి తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ? ఎవరికి వారు మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు.


ఈ నేపధ్యంలో ఫిరాయింపు ఎంఎల్ఏకి టిక్కెట్టు ఇఛ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  కాకపోతే ఒక ఊరట ఏమిటంటే, జలీల్ కు బదులు ఆయన కూతురు, ఎన్ఆర్ఐ షబానా ఖాతూన్ కు టిక్కెట్టు ఖాయం చేశారు. ఆమె కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి బాగా ఉత్సాహం చూపుతున్నారు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు అనేక సర్వేలు చేయిస్తున్నారు. అయితే ఏ సర్వేలో కూడా జలీల్ గెలుస్తాడన్న ఫీడ్ బ్యాక్ రాలేదని సమాచారం. అసలే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చావో రేవో అన్నట్లుగా తయారైంది.


రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒకపుడు జగన్ పై ఇదే ఫిరాయింపు ఎంఎల్ఏ ఎన్ని సవాళ్ళు విసిరారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనపై గెలవాలంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. తీరాచూస్తే చంద్రబాబు అసలు టిక్కెట్టే ఇవ్వలేదు. గెలవడని తెలిసే అనారోగ్యమనే షుగర్ కోటింగ్ మందును పూసి చివరకు కూతురును రంగంలోకి దింపుతున్నారు. 


దాంతో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం కూడా చంద్రబాబుకు చాలా ఇంపార్టెంటే.  ఇటువంటి సమయంలో ఓడిపోతాడని ఫీడ్ బ్యాక్ వచ్చిన జలీల్ కు టిక్కెట్టు ఇవ్వలేరు. అలాగని టిక్కెట్టు నిరకారించలేరు. ఎందుకంటే, టిడిపిలో టికెట్టు దక్కకపోతే జలీల్ మళ్ళీ ఏ జనసేనలోకో లేకపోతే ఇంకేదో పార్టీలోకి దూకేసి పోటీ చేస్తారు. దాంతో టిడిపికి ఇబ్బందులు తప్పవు. అందులోను పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు బాగానే ఉన్నాయి. అందుకనే బాగా ఆలోచించే చంద్రబాబు మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. జలీల్ కు టిక్కెట్టు నిరాకరించిన చంద్రబాబు ఆయన కూతురుకు టిక్కెట్టిస్తానని చెప్పారు. 


చేసేది లేక జలీల్ విదేశాల్లో ఉన్న కూతురును వెంటనే పిలిపించారు. దాంతో చంద్రబాబు ఆమెకు టిడిపి కండువా కప్పేసి టిక్కెట్టు ఖాయం చేసేశారు. జలీల్ కు అనారోగ్యం కారణంగా పోటీ చేసే స్ధితిలో లేరు కాబట్టే ఆయనకు బదులు కూతురును రంగంలోకి దింపారని ప్రచారం చేస్తున్నారు. అసలు కూతురుకు టిక్కెట్టిస్తానని చంద్రబాబు చెప్పకపోయినా జలీల్ ఓవర్ యాక్షన్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద తేలిందేమిటంటే, ఫిరాయింపు ఎంఎల్ఏకి చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వదలచుకోలేదన్నది స్పష్టమైంది. మరి ఫిరాయింపుకు బదులు సంతానానికి టిక్కెట్టు ఇవ్వటమన్నది ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే పరిమితమా లేకపోతే మిగిలిన ఫిరాయింపు నియోజకవర్గాల్లో కూడా ఇదే సూత్రం పాటిస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: