ఎడిటోరియల్: 5 రాష్ట్రాల్లో గెలిచిందెవరు.. ఓడిందెవరు..?

Chakravarthi Kalyan

2019లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు.. జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా ఎన్నికల పండితులు చెప్పుకున్నారు. అందులోనూ ఈ ఐదింటిలో మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంది.. ఓసారి పరిశీలిద్దాం..



రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం.. మొత్తం ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంల్లో ఓటర్లు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. చత్తీస్ గడ్, మిజోరంలలో ప్రభుత్వాలు మారాయి. చత్తీస్‌గఢ్‌లో సుదీర్ఘమైన బీజేపీ పాలన ముగిసింది. ఓటర్లు కాంగ్రెస్ కు భారీ విజయం అందించారు. అలాగే మిజోరంలో కాంగ్రెస్ ఓటమి పాలవగా మిజో నేషనల్ ఫ్రంట్ అధికారం చేపట్టనుంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సరిగ్గా మ్యాజిక్ మార్కును చేరుకుంది. మధ్యప్రదేశ్ లో మాత్రం ఇంకా హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఇరుపక్షాలకూ దాదాపు సమాన సంఖ్యలో సీట్లు వస్తుండంతో ఇక్కడ ఇండిపెండెట్ల పాత్ర కీలకంగా మారనుంది.



ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. చత్తీస్‌ గడ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ వరుసగా 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. చావల్ బాబాగా పేరున్న రమణ్ సింగ్ సర్కారుపై ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు సాధించి మూడింట రెండు వంతులకు పైగా సీట్లు సాధించి జయ కేతనం ఎగురవేసింది. బీజేపీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించగా.. అజిత్ జోగి ఆధ్వర్యంలోని జేసీసీ 9 స్థానాలు సాధించింది.


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. ఇక్కడ కూడా బీజేపీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు. మొత్తం ఇక్కడ 230 స్థానాలు ఉండగా 116 మ్యాజిక్ మార్క్‌గా ఉంది. కాంగ్రెస్ 112 వరకూ స్థానాలు సాధించే అవకాశాలున్నాయి.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ 108 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. రాత్రి 8 గంటలు దాటే వరకూ కూడా సగం స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో వారు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.


మిజోరంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ సీఎం సైతం ఓడిపోయారు. ఇతరులు మిగిలిన సీట్లు గెలుచుకున్నారు.


ఇక తెలంగాణలో కారు జోరు కొనసాగింది. మొత్తం 119 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. నాలుగు పార్టీల ప్రజాకూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం కాంగ్రెస్ మాత్రమే 19 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించగా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ప్రజాకూటమిలోని తెలంగాణ జన సమితి, సీపీఐ కనీసం ఖాతా తెరవలేదు. బీఎల్‌ఎఫ్‌ కూడా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: