పానకంలో పుడకలాగా కాంగ్రెస్ గెలుపుకు అడ్డుపడుతున్న మాయవతి

గెలుపు ఆనందాన్ని ఇచ్చేదైనా రాజకీయాల్లో ఆగర్భ శత్రువుపై విజయం సాధించటంలో ఉన్న మజా ఆ ఆనందం వర్ణించనలవి కాదు!  ఖచ్చితంగా రాజస్థాన్ లో బిజెపిపై తాము గెలవగలమన్న ధీమాతో కాంగ్రెస్ ఉబ్బితబ్బిబౌతుంది.  ఐదు రాష్ట్రాల శాసనసభలకు తాజాగా జరుగనున్న ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా సానుకూల అవకాశాలు ఉన్నాయంటే అది రాజస్తాన్ లో మాత్రమే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించి కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలాకాలం నుండి కొన్ని సర్వేలు కోళ్ళై కూస్తూనే ఉన్నాయి.  

బీజేపీని  ఓడించి కాంగ్రెస్ అధికారం చేపడితే, అది రేపటి ఎన్నికల ముందు, కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చే అంశం అవుతుంది. వేరే ఏదైనా పార్టీని ఓడించి అధికారాన్ని సొంతం చేసుకోవడం వేరు.  బీజేపీని ఓడించి అధికారాన్ని సాధించుకోవడం వేరని ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించిన ఆనంద కరమైన అంశం లేదు.  ప్రస్తుతం బాజపాకు దేశ వ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేఖ పవనాల నేపథ్యంలో, తమకై తాము బాజపాపై రాజస్తాన్ లో గెలుపు గ్యారెంటీ అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. 

అయితే ఇక్కడ కొత్త క్లైమాక్స్ ఏమంటే కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ రూపంలో ఝలక్ తప్పడం లేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వడ్ స్థానాల్లో బీఎస్పీకి మంచిపట్టు ఉంది. ఇక్కడ దళిత, అణగారిన వర్గాల ఓటు బ్యాంకు కు మాయవతి తొలి నుంచీ గాలం వేస్తోంది.  మొన్నటి వరకూ బీఎస్పీతో పొత్తుకు కూడా కాంగ్రెస్ తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం ఆశలపల్లకిలో ఊరేగుతూ ముందుకు రాలేదు. ఆమె సొంతంగానే తేల్చుకుంటానని ఒంటరి పోరాటానికి సిద్ధం అయ్యింది. దాదాపు యాభై అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మాయవతి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకుల అంచనా. 

ఆమె పార్టీ నెగ్గకపోయినా కాంగ్రెస్ అవకాశాలను చాలా వరకూ ధారుణంగా దెబ్బ తీయగల బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిఎస్పి చీల్చేవీలుంది.  కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని బీఎస్పీ నేతలు స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే చోట మాయావతి రూపంలో నూతన  ప్రతిబంధకం ఎదురవుతుండటంతో కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. అతి తేలికగా గెలవ గలమన్న రాజస్థాన్ ఎన్నికల పానకంలో కాంగ్రెస్ కు మాయావతి పుడకలా అడ్డుపడుతుందని కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు బెంబేలెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: