కలిసి వెళ్దామని కోరితే కేసీఆర్‌ కాదన్నారు: చంద్రబాబు గారి ఉద్భోదలు

తెలుగువారి మధ్య విభేదాలు లేకుండా చూడటానికి టీఆర్‌ఎస్ తో  తాము (టిడిపి) కలిసి ప్రయాణించాలని ప్రతిపాదించినా, ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుపడ్డారని చంద్ర బాబు పేర్కొన్నారు. నిన్న బుధవారం ఆయన మంత్రులతో ప్రస్తుత రాజకీయాలపై సుమారు రెండు గంటలు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు-"రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఢిల్లీలో మనకు పలుకుబడి తగ్గిందని అందువల్లనే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్‌ఎస్‌ కలిసి ప్రయాణిస్తే మళ్లీ కొంత ప్రభావం చూపగలమని, తెలుగువారి ప్రాముఖ్యత నిలుస్తుందని ఆశించాను.


నిజానికి, తెలంగాణలో టిడిపిని సమూలంగా తొలగించాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నించింది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కలిసి రాలేదు. అవన్నీ పక్కన పెట్టి టీఆర్‌ ఎస్ కు స్నేహ హస్తం అందించాను. కానీ నరేంద్ర మోదీ అడ్డుపడటంతో టీఆర్‌ఎస్‌ ముందుకు రాలేదు" అని బాబు వివరించారు. బీజేపీ చేతిలో పావుగా మారి కేసులతో ఇబ్బంది పెట్టాలని అనుకొంటున్నారని విమర్శించారు.


"తొలుత ఈడీని రంగంలోకి దించాలని ప్రయత్నించారు. అది వీలుగాకపోవడంతో ఆదాయపు పన్నుశాఖను దించారు. ఏం చేసుకొంటారో? చేసుకోనివ్వండి. దేనికైనా మనం సిద్ధంగా ఉన్నాం"’ అని వ్యాఖ్యానించారు. జగన్‌, పవన్‌ లను కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని, ఏపీలో టీడీపీ బలహీనపడితే దక్షిణాదిలో ఆయనే బలమైన నాయకుడు అవుతా రని బీజేపీనేతలు ఆశచూపినట్లుందని ఒకమంత్రి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో కొత్తగా దర్యాప్తు మొదలుపెట్టాలని కేంద్రానికి తెలంగాణ ఏసీబీ తో లేఖ రాయించా రు. దానిని ఆసరాగా తీసుకొని కేంద్రం తన ఏజెన్సీలను రంగంలోకి దించి దాడులు మొదలు పెట్టింది" అని రాయలసీమకు చెందిన ఒక మంత్రి అభిప్రాయపడ్డారు.


మహాకూటమిపై కేసీఆర్‌ చేస్తున్న విమర్శల గురించి మరో మంత్రి ప్రస్తావించగా "కలిసి వెళ్దామని కోరితే కేసీఆర్‌ కాదన్నారు. అది జరిగి ఉంటే తెలంగాణలో మహాకూటమి ఆవిర్భావం జరిగేది కాదు మిగిలిన వారెవరూ కలిసే వారు కాదు. బీజేపీ చేతిలో ఇరుక్కుని, ఇప్పుడు మహాకూటమిపై బాధ పడితే ఎలా?" అని బాబు స్పందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: