కర్ణాటక - రసకందాయంలో రాజకీయం? సిద్ధూ జంపింగ్ జపాంగ్ అవనున్నారా?

తుమ్మితే ఊడిపోయేముక్కు లాంటిదే కర్ణాటకలో కుమార ప్రభుత్వం. కాంగ్రెస్ కు మాత్రమే కాదు ఆ పార్టీలో ఏ వర్గానికి తేడా వచ్చినా అరిటాకు మీద ముల్లు పడ్డా ముల్లు మీద అరిటాకు పడ్డా చిరిగి పోయేది అరిటాకే అన్న సామెతలాగా ఉంటుంది జెడిఎస్ ప్రభుత్వ పరిస్థితి. ఇక అవుటర్ ఆర్బిట్ లో గద్ద లాగా కోడి పిల్లలను (ఎమెల్యెలు) ఎగరేసుకు పోవటానికి బిజెపి ఉండనే ఉంది. కాంగ్రెస్ ను గాని జెడిఎస్ ను గాన్ని నిట్టనిలువుగా చీల్చి అంకెలగారడీ చేయటం ఎలాగో దానికి బాగా తెలుసు. ఇప్పుడు సిద్దరామయ్య కొత్త రామాయణం మొదలెట్టే దాఖలాలు కనిపిస్తున్నాయి.  


కర్ణాటక రాష్ట్రంలో హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడబోతుందా? మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు బీజేపీ ఏమైనా బంపర్ ఆఫర్ ఇచ్చిందా? ప్రభుత్వ ఏర్పాటుకు శాయశక్తుల ప్రయత్నించి విఫలం అయిన బీజేపీ మళ్లీ తన రాజకీయ చదరంగంలో పావులు కదుపుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

 

తాజాగా  ముఖ్యమంత్రి పదవిపై ఈ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య మరోసారి తన మనసులో మాటను వెల్లడించారు.  రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్లీ తాను ముఖ్యమంత్రి ని అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు గెలుచు కోలేకపోయామన్నారు. జేడీయూతో చేతు కలపడం వల్లే తాను ముఖ్యమంత్రిని కాలేకపోయానని చెప్పుకొచ్చారు.

 

హసన్‌లో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. కాగా కర్ణాటక లో ఏర్పడిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆది నుంచే అసంతృప్తి నెల కొంది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో పాటు, తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వేగంగా పావు లు కదుపుతోంది. సిద్ధరామయ్యకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా ఊహాగానాలు వెలువడు తున్నాయి.

 

సిద్ధరామయ్య తో పాటు కాంగ్రెస్ లో పదవులు దక్కని నేతలతో రాజీనామాలు చేయిస్తే కుమార స్వామి ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారం తాము చూసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో సిద్ధరామయ్యకు ఉపరాష్ట్రపతి పదవి కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజల ఆశీస్సులు ఉంటే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: