“బాబు గారూ.. మీతో ఇదే ఇబ్బంది..” చంద్రబాబుకు సూటిగా చెప్పిన జేసీ..!!

Vasishta

జేసీ దివాకర్ రెడ్డి.. ఈ పేరొక్కటి చాలు..! ఆయన రూపం మదిలో మెదలడానికి.. ఆయన మాటలు గుర్తు చేసుకోవడానికి..! ఆయన ఏం చేసినా వెరైటీ.. ముక్కుసూటితనం ఆయన నైజం..!! తాజాగా ఆయన నోటికి పని చెప్పారు.. జగన్ పై నిప్పులు చెరుగారు.. చంద్రబాబు, లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. మహానాడు వేదికగా ఆయన చేసిన ప్రసంగం సభికులందరి నుంచి ప్రశంసలు అందుకుంది..


చంద్రబాబునాయుడుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంకోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పనితీరులో తాను ఇంతవరకూ అలాంటి నేతను చూడలేదన్నారు. అలాంటి నేతను గెలిపించుకోవడం ప్రజల బాధ్యత అన్నారు. చంద్రబాబుకు ఓటేయాలని తాను చెప్పనంటూనే... ఆయన అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. ఆయన్ను ప్రజలు గెలిపించుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో చంద్రబాబు అవసరం చాలా ఉందున్నారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా చేసింది చాలని.. ఇక ప్రధాని కావాల్సిందేనని జేసీ చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు. దేశానికి మీ సేవలు ఎంతో అవసరమన్నారు. అలాగే రాష్ట్ర పగ్గాలు లోకేష్ కు అప్పగించాలని సూచించారు.. లోకేష్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేమీ లేదన్నారు.


ఇక జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ కన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయన్నారు. కనబడితే కబ్జా చేసే వ్యక్తి తన తాత రాజారెడ్డి అన్నారు. జగన్ ఎవరి మాటా వినరని స్వయంగా వైఎస్సే తనతో చెప్పారన్నారు. వైసీపీలో చేరాలని విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం పంపాడని, తనకు జగన్ దగ్గర ఊడిగం చేయడం ఇష్టం లేదని తిప్పిపంపానన్నారు. బీజేపీతో జగన్ కొత్త బంధుత్వం చేస్తున్నారన్నారు. 15 వందల కోట్ల రూపాయలు మోడీ నుంచి జగన్ కు అందబోతున్నాయని జేసీ చెప్పారు.


ప్రధాని నరేంద్రమోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జేసీ దుయ్యబట్టారు. హుందాగా వ్యవహరించడం లేదన్నారు. అలాంటి చిల్లర చేష్టలు చేసే వ్యక్తులు ప్రధానిగా ఉండకూడదన్నారు. బీజేపితో కలసి పనిచేయడం కుదరదని తాను ప్రారంభంలోనే చెప్పానని జేసీ వెల్లడించారు. మోడి ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని చంద్రబాబుకు చెప్పినట్టు వివరించారు. కియా మోటర్ కార్ల ఫ్యాక్టరీని అడ్డుకొనేందుకు మోడి ప్రయత్నించారన్నారు. గుజరాత్ లో కియా కర్మాగారాన్ని నిర్మించాలని కియా యాజమానికి మోదీ ఫోన్ చేశారని చెప్పారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. పోలవరంలో జరిగిన అవకతవకల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లబ్ది పొందారని జేసీ చెప్పారు. పోలవరం పాపం ఆయనదేనన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. చంద్రబాబును చూసి ఎవ్వరూ ಓటు వేయద్దన్న జేసీ.. ప్రజలు వారి భవిష్యత్ కోసం టీడీపీకి ఓటేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్సుల వల్ల, జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు జేసీ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం కలెక్టర్ల కాన్ఫరెన్సులో మాత్రమే బాబు పాల్గొనాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: