రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల కళ వచ్చేసింది. సాధారన ఎన్నికలకు కేవలం 20 నెలలే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికలవైపే దృష్టి సారించాయి.
దీంతో ఇందిరమ్మబాట, సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్, బీసీలు, యువతరం పేరుతో టిడిపీ ఇలా ఎవరికి తోచినట్లు వారు రాష్ర్టాన్ని చుట్టేస్తున్నారు.
రాష్ర్టంలో జూన్ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో చావు దెబ్బతిన్నపార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులేస్తూ... గతంలో జరిగిన తప్పిదాలను గుర్తిస్తూ ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇదిలావుంటే... గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి పార్టీ సైతం వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. తమకు కలిసొచ్చే విషయాలపై చర్చలు జరుపుతోంది.
ఎనిమిదేళ్ల క్రితం పోయిన అధికారాన్ని తిరిగి సాధించేందుకు ప్రత్యేక ప్రణాలికలతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. రూటు మార్చి ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఏ ఏ వర్గాలు తెదేపా పార్టీకి దూరమయ్యాయి, ఏ వర్గాలు పార్టీని అంటి పెట్టుకున్నాయో అనే అంశాలపై ఆ పార్టీ ప్రతినిధులు లెక్కలేస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో నేడు నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడమే కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయిందని, వచ్చే రోజుల్లో పార్టీకీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్న దానిని అక్కడే సాధించాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
పార్టీకి దూరమైతున్న అన్ని వర్గాలను ఆకర్షించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. మున్నూరుకాపు, పెరిక, యాదవ,ఎస్సీ, బీసీ వర్గాలతోపాటు మైనార్టీ ఓట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా పార్టీకి డోకాలేదనేది బాబునమ్మకం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటినుంచి టీడీపీకే మద్దతుగా నిలుస్తున్న కమ్మవర్గం ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల వైపు మోగ్గుచూపిస్తున్న ఇతర వర్గాలను సైతం వీలైనంత వరకు తమ పార్టీవైపునకు తిప్పుకునేందు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు మహిళా సంఘాలు, యువజన సంఘాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీని నిలబెట్టేందుకు ఎన్నికష్టాలొచ్చిన వెనకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు పార్టీకి కావల్సిన కొత్త రక్తాన్ని బాబు ఎక్కిస్తున్నారు. ఇదిలావుంటే పార్టీలో వస్తున్న వారసత్వ పోరును పక్కనబెడితే సక్సెస్ ఫుల్ లీడర్ గా బాబు పార్టీ పగ్గాలు మోస్తున్నారు.
పార్టీలో పంటి కింద రాయిలా వస్తున్నసమస్యలను మెల్లగా తొలగిస్తూ 2014లో పార్టీని గట్టేకించేందుకే చక్రం తిప్పుతున్నారు. అయితే బాబు అమలు చేస్తున్న వ్యూహాత్మక ప్రణాలికలతో రాబోవురోజుల్లో పార్టీకి పూర్వవైభవం వస్తుందని పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: