ఏపీలో రోడ్ల దిగ్బంధనం సక్సెస్..! ప్రత్యేకహోదా కోసం కలిసిన వైసీపీ - జనసేన.!!

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీలన్నీ ఏకమయ్యాయి. అయితే వేటికవే ఉద్యమం చేస్తున్నాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రహదారుల దిగ్బంధంలో మాత్రం పార్టీలన్నీ రోడ్లపైకి వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ, జనసేన పార్టీ శ్రేణులు రహదారుల దిగ్బంధంలో ముందున్నాయి.


          ప్రత్యేక హోదా సాధనకోసం ఆంధ్రప్రదేశ్ గళమెత్తింది. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ సుమారు 2 గంటల సేపు రహదారులను ప్రజలు ముట్టడించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వారికి అనుకూలంగా ఉండేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


          రహదారుల దిగ్బంధనంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ పాల్గొన్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపును జనసేన, వైసీపీ స్వాగతించాయి. కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక హోదన సాధన సమితిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక అధికార టీడీపీ కూడా ప్రత్యేక హోదా కోసం ఏ రూపంలో ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తామని ప్రకటించింది. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరింది. దీంతో టీడీపీ శ్రేణులు కూడా రహదారుల దిగ్బంధనంలో పాల్గొన్నాయి. రోడ్లపైన కాకుండా రోడ్లకు ఇరువైపులా టెంట్లు వేసి ప్రత్యేక హోదా కోసం టీడీపీ శ్రేణులు నినదించాయి.


          ఇక రహదారుల్లో కాంగ్రెస్, వైసీపీ, జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. కమ్యూనిస్టులు తమ సహజ శైలిలో రోడ్లపై ధూంధాం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా రోడ్లకు ఇరువైపులా టెంట్లు వేసుకుని ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఓవరాల్ గా ప్రత్యేక హోదాకోసం చేసిన రహదారుల దిగ్బంధానికి మంచి స్పందన లభించింది. ఏపీలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా పట్టించుకోదనే అపవాదు ఎదుర్కొంటున్న నేషనల్ మీడియా కూడా ఈసారి కవరేజ్ కు రావడం సంతోషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: