అమరావతి అసెంబ్లీ అబద్ధాల వేదిక - ప్రతిపక్షంలేని చర్చ ఒంటి చేతి చప్పట్లు

పోలవరం ప్రోజెక్ట్ నిర్మాణ వ్యయం కేంద్ర భరిస్తుంది. నిర్మాణ భాధ్యత రాష్ట్రం వహిస్తుందనేది 2015 నుంచి జనాలకు తెలిసిన విషయం. రాష్ట్రం లో ఏ పసి బాలుణ్ణి అడిగినా తడుముకోకుండా చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ విషయాన్ని  ముఖ్యమంత్రి అద్భుతంగా పదే పదే ప్రచారం చేశారు. 

అయితే అదే పోలవరాన్ని అంటే పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి శాసనసభను మాట మార్చి తప్పుదోవ పట్టించారు. బుధవారం అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని తాము కోరలేదన్నారు. నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సిఫార్సుల మేరకు కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని ప్రకటించారు. 


కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గత ఏడాది సెప్టెంబరు 7న అర్ధరాత్రి రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటిస్తూ నిర్వహించిన విలేకరుల సమావేశంలోగానీ, ఆ మరుసటి రోజు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో గానీ అలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు. మే 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌కు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి డాక్టర్‌ అమర్జీత్‌ సింగ్‌ రాసిన లేఖలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారు. మరి బాబు గారు నేడు అదీ శాసన సభ సాక్షిగా అలా అబద్ధమాడటం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. 


రాష్ట్ర విభజన సందర్భంగా, 2014లో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని 'జాతీయ ప్రాజెక్టు' గా ప్రకటించింది. పునర్విభజన చట్టం సెక్షన్‌ 90లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, ఆ ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే త్వరిగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 'పీపీఏ' తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. కానీ, చంద్ర బాబు సర్కారు పట్టించు కోలేదు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత లను తమకే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాసింది.


దీనివల్ల దాదాపు ఒక సంవత్సరం పైగా అంటే 2015ఆఖరివరకూ ప్రాజెక్టు జలాశయం (హెడ్‌ వర్క్స్‌) పనుల్లో ఎలాంటి చలనం లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కద్డే ఉన్ నట్లుండేది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత శాసనసభలో ముఖ్యమంత్రిని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించాలంటూ తాము ఎలాంటి లేఖ రాయ లేదని, లేఖ రాసినట్లు నిరూపించా లంటూ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు.


రాష్ట్రంలో సంచలం కలిగించేలాగా 2016లో 'ప్రత్యేక హోదా' ఉద్యమం ఉవ్వెత్తున ఉదృతంకాగా దాని పరిణామాలని పసి గట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రితో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత 2016సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే లేకపోవడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం జన సామాన్యానికి బాగా తెలుసు.


ముఖ్యమంత్రి మాత్రం లేని ప్యాకేజీని ఉన్నట్లు చూపిస్తూ, దాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సెప్టెంబర్‌ 7న నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ, 8న జారీ చేసిన ప్రకటనలోనూ విస్పష్టంగా ఉండడం గమనార్హం.


పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరిస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇస్తే, ప్రత్యేక ప్యాకేజీలో మాత్రం 2010–11 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని ప్రకటించింది. 2014ఏప్రిల్‌ 1కి ముందు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి చేసే ఖర్చును మాత్రమే భరిస్తామని తేల్చి చెప్పింది. దీనివల్ల 960మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాల్సిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.4,205.66 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం అప్పగించిన మరుసటి రోజే జలాశయ నిర్మాణ (హెడ్‌ వర్క్స్‌) అంచనా వ్యయాన్ని రూ.1,481 కోట్లు పెంచేసి, "ట్రాన్స్‌-ట్రాయ్‌" ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌-కాంట్రాక్టర్లకు చంద్రబాబుప్రభుత్వం అప్పగించింది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాక కూడా పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిర్దేశించిన మేరకు పురోగతి లేదని ఇటీవల "మసూద్‌ హుస్సేన్‌ కమిటీ" తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రవిమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం,నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు మరోసారి వ్యూహం రచించారు. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, "పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని మనకై  మనం కోరుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే సమయంలో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సిఫార్సుల మేరకు కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది" అంటూ సభను తప్పుదోవ పట్టించారు.


అసలు ఈ విషయం లో కేంద్రం ఏదైనా ప్రకటన విడుదల చేసేంతవరకు మన ముఖ్యమంత్రి ఇలా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. "ఇప్పుడు శాసన సభలో ప్రతిపక్షం లేదు. అక్కడ ప్రశ్నించే వారు లేరు. సభ వెలుపల వెయ్యినోళ్లతో  బాకా ఊదే పత్రికలు అన్నీ దాదాపుగా మన డప్పుగాళ్ళే. ఇక నిజం సమాధి అవుతుందేమో? అందుకే "ప్రతిపక్షం లేని శాసనసభ ప్రత్యర్ధిలేని యుద్ధక్షేత్రం" అది ప్రజాస్వామ్యపతనానికి పరాకాష్ఠ" అంటారు. 


అయితే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏమంటే ఏ పనీ సక్రమంగా జరగకుండా, చేయకుండా లేని అభివృద్ధిని కంఠశోషతో ఉన్నట్లుగా చూపిస్తూ, విభజన ఫలాలను కేంద్రం నుండి సాధించలేక అబద్ధాలను జనంపై కుమ్మరించే అధికార పార్టీ నాయ కుడు ఒక ప్రక్క-ఏ మాత్రం భాధ్యత లేకుండా స్వార్ధమే పరమార్ధంగా శాసనసభను వదిలేసి ఉళ్ళదారి పట్టిన ప్రతిపక్ష నాయకుడు మరోప్రక్క జనాన్ని వాయిస్తూ చివరికి ఈ రాష్ట్రానికి చేసేది శూన్యంగానే కనిపిస్తుంది.


వీళ్లిద్దరికి ఈ రాష్ట్రం అంటే ప్రేమలేదు గౌరవం లేదు. స్వార్ధమే పరమార్ధంగా పనిచేసే వీరికి, ఇలాంటి రాజకీయ శూన్యత ఆవహించిన రాష్ట్రానికి “ ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం నిర్మాణం” ఎంతో అవసరం. దీనికోసం జయప్రకాష్ నారాయణ, చలసాని  శ్రీనివాస్, నటుడు శివాజి లాంటివాళ్ళు ప్రజలను ఐఖ్యం చేయటం చాలా అవసరంగా కనిపిస్తుంది. 


అవసరమైతే ఇతర సామాజిక సేవా సంస్థలను ఇందులో బాగం చేయటం చాలా అవసరం. పాత స్వార్ధపరులను గతములో వాగ్ధానాలు చేసి వాటిని నెరవేర్చటానికి పూనుకోకుండా ఇప్పుడు ఎప్పుడో పెట్టిన రాజకీయ పార్టీకి ప్రాణం పోసే వాళ్లను దూరం పెట్టటం కూడా చాలా అవసరం. ఇదే సరైన సమయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: