గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆ పెయింటింగ్స్ తొలగించడం వెనుక ఎవరి హస్తముందో తెలుసా..?

Vasishta

గన్నవరం విమానాశ్రయం ఇటీవలే అంతర్జాతీయ హోదా సంతరించుకుంది. రాష్ట్ర విభజన ముందువరకూ డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కే పరిమితమైన ఈ ఎయిర్ పోర్ట్ ఇటీవల అంతర్జాతీయ విమానాలకు కూడా పచ్చజెండా ఊపింది. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివిధ రకాల పెయింటింగ్స్ తో అలంకరించారు. అయితే వాటన్నింటినీ ఇప్పుడు తొలగించారు. దీని వెనుక కేంద్రం హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


          గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన, టీడీపీ ఎంపీ పూసపాటి అశోక గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి మహర్దశ పట్టింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా అనుమతులు పొందింది. రన్ వే విస్తరణ పనులకు మోక్షం లభించింది.


          గన్నవరం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారం. అందుకే విమానాశ్రయంలో బౌద్ధ శిల్పకళ ఉట్టిపడేలా శిల్పాలు, ఛాయాచిత్రాలను పెద్దఎత్తున అమర్చారు. ఎయిర్ పోర్టు వెలుపలే కాకుండా లోపల కూడా బుద్ధుని పెయింటింగ్స్ తో నిండిపోయాయి. అమరావతిలో బౌద్ధం ఒకప్పుడు విలసిల్లింది. అంతేకాక.. చైనా, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చే దేశవిదేశీ ప్రతినిధులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పెయింటింగ్స్ ఏర్పాటు చేసింది.


          అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో బౌద్ధ చిత్రాలు నింపేయడంపై కేంద్రానికి కోపం వచ్చినట్టుంది. వెంటనే వాటిని తొలగించాల్సిందిగే కేంద్రంలోని పెద్దల నుంచి కేంద్ర విమానయాన శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చినట్టు అనధికార సమాచారం. విభిన్న మతాలు అనుసరించే ఆంధ్రప్రదేశ్ లో కేవలం బౌద్ధానికి చెందిన బొమ్మలను మాత్రమే ఎయిర్ పోర్టులో పెట్టడం సరికాదని సూచించినట్టు తెలిసింది. అందుకే వెంటనే వాటిని తొలగించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: