పొరపాటున కూడా ఏపీ జపాన్ లా కావొద్దు..! చంద్రబాబు సెన్సేషన్ కామెంట్స్..!!

Vasishta

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు జపాన్, సింగపూర్ జపం చేస్తుంటారు. రాష్ట్రాన్ని సింగపూర్ లా మారుస్తానని, జపాన్ లాగా తయారు చేస్తానని చెప్తుంటారు. అయితే తొలిసారి ఆయన నోటి వెంట జపాన్ కు వ్యతిరేకంగా మాటలొచ్చాయి. పొరపాటున కూడా జపాన్ లాగా ఏపీ తయారుకావొద్దన్నారు చంద్రబాబు. ఇంతకూ ఆయన ఎందుకలా అన్నారో చూడండి.


ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సాయం కూడా తీసుకుంటున్నారు. సందర్భం ఎప్పుడొచ్చినా జపాన్ సాంకేతికత, సింగపూర్ అభివృద్ధి సాధించిన తీరును చంద్రబాబు కొనియాడుతూ ఉంటారు. వారి పట్టుదలను ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలా శ్రమించాలని సూచిస్తూ ఉంటారు.


అయితే తొలిసారి చంద్రబాబు జపాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పొరపాటున కూడా జపాన్ లాగా ఆంధ్రప్రదేశ్ తయారుకావద్దని హెచ్చరించారు. ఇంతకూ ఆయన ఏ విషయంలో అన్నారో తెలుసా... జనాభా విషయంలో.! అవును.. జపాన్ లో ప్రస్తుతం వృద్ధ జనాభా పెరిగిపోయింది. పనిచేసే యువకులు కరువయ్యారు. దీంతో ఆ దేశం ఉత్పాదకత తగ్గిపోయింది. మరికొన్నేళ్లపాటు జపాన్ లో ఇదే పరిస్థితి ఉండనుంది. తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కోనుంది.


ఒకప్పుడు చంద్రబాబు కూడా కుటుంబానికి ఒకర్ని మాత్రమే కనాలని సూచించారు. జనాభా పెరిగితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. దేశంలో జనాభా నియంత్రణ అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లలను కనడం తగ్గిపోయింది. దీంతో క్రమంగా యువత కూడా తగ్గిపోవడం మొదలైంది. ఇప్పుడిప్పుడే జపాన్ లో లాగా మన దేశంలో కూడా వృద్ధ జనాభా పెరుగుతోంది. వృద్ధ జనాభా పెరిగితే విపరిణామాలు తప్పవని భావించిన చంద్రబాబు.. అలాంటి పని చేయొద్దన్నారు. జనాభా విషయంలో మాత్రం ఏపీ జపాన్ లా కావద్దని సూచించారు.


 చంద్రబాబు గతంలో కూడా జనాభా నియంత్రణపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఎంతటి జనాభానైనా తట్టుకోగలగే కెపాసిటీ దేశానికి ఉందని, వీలైనంత ఎక్కువ మందిని కనాలని చంద్రబాబు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: