వచ్చే ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఇదే..!!

Vasishta

2019 అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేయనున్నారా..? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగబోతున్నారా..? ఆయన హిందూపురం నుంచి బరిలోకి పోటీ చేస్తారా..? అప్పుడు మామగారు బాలయ్య పరిస్థితి ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!


          తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో లోకేశ్ బరిలోకి దిగుతారనే సమాచారం అందుతోంది. తాతగారు ఎన్టీఆర్, మావయ్య బాలకృష్ణ, హరికృష్ణ.. తదితరులు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అదే బాటలో లోకేశ్ కూడా పోటీ చేయనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి.


          ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. మొదట్లో పీఏ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పీఏను తప్పించారు. అయితే కార్యకర్తలు, అభిమానులతో బాలయ్య ప్రవర్తన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో వీరాభిమాని, టీడీపీ కార్యకర్త అయిన బాలాజి అనే వ్యక్తిపై బాలయ్య చేయి చేసుకున్నారు. ఇది స్థానికంగా పెద్ద దుమారమే లేపింది. చాలా మంది స్థానిక నేతలు బాలయ్య తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.


          ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మళ్లీ హిందూపురం నుంచి బాలయ్యను దింపితే పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చేమోననే ఆందోళన పార్టీ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. అందుకే బాలయ్యకు మరో పదవి కట్టబెట్టి అక్కడి నుంచి లోకేశ్ ను బరిలోకి దింపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తోంది. బాలకృష్ణను రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.


          లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేరనే భయంతోనే దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రిపదవి కట్టబెట్టారని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి విమర్శలకు చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే లోకేశ్ ను ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దింపి గెలిపించడం ద్వారా ప్రత్యర్థుల నోటికి తాళం వేయొచ్చని అంచనా వేస్తోంది. అయితే లోకేశ్ కు హిందూపురంను మించిన సేఫ్ ప్లేస్ మరొకటి ఉండకపోవచ్చని, అందుకే అక్కడి నుంచే బరిలోకి దింపాలని టీడీపీ దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: