వాళ్లు గెలవడం చంద్రబాబు వ్యూహమేనా..? బీజేపీ అనుమానాలు..!!

Vasishta

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది. 9 చోట్ల పోటీ చేస్తే 3 చోట్లే గెలవడం, మరో 3 స్థానాల్లో టీడీపీ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించడం.. ఆ పార్టీలో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఒంగోలులో జరిగిన సమావేశంలో నేతలు విస్తృతంగా చర్చించారు.


          కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 38 చోట్ల పోటీ చేసి 32 చోట్ల గెలిచింది. బీజేపీ 9 చోట్ల పోటీ చేసి 3 చోట్ల విజయం సాధించింది. 6 స్థానాల్లో ఓడిపోయింది. తమకు బాగా పట్టుందనుకున్న స్థానాలనే బీజేపీ ఏరికోరి మరీ తీసుకుంది. అయినా 6 చోట్ల ఓడిపోవడం, అక్కడ టీడీపీ రెబెల్ అభ్యర్థులు గెలవడం.. బీజేపీని ఖంగు తినిపించింది.


          అయితే టీడీపీ రెబెల్ అభ్యర్థుల విజయం వెనుక టీడీపీ ఉందా.. అనే కోణంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఒంగోలులో జరిగిన సమావేశంలో పలువురు నేతలు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గురు రెబెల్ అభ్యర్థులు గెలవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందా.. ఇదంతా ఆయనకు తెలిసే జరిగిందా..? ఆయన వ్యూహంలో భాగంగానే వీరు గెలిచారా.. ఇలా అనేక అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి.


          అయితే.. ఇవన్నీ చంద్రబాబు వరకూ వెళ్లకపోయి ఉండొచ్చని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఒక్క నేత మాత్రం చంద్రబాబే ఇదంతా చేయించారని గట్టిగా నొక్కి వక్కాణించారు. అయితే మిగిలిన నేతలెవరూ ఆ నేత మాటలను పెద్దగా పట్టించుకోకుండా మరో అంశంలోకి వెళ్లిపోయారు.


          అన్నిటికీ మించి.. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ముందు టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలనుకున్న బీజేపీ.. ఆ ఎన్నికల తర్వాత మనసు మార్చుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఒంగోలు మీటింగ్ లో దీనిపైన కూడా కాసేపు నేతలు చర్చించుకున్నారు. ఇప్పట్లో టీడీపీని కాదని ఎలా ముందుకెళ్లినా మన ఉనికికే ప్రమాదం తప్పదని మెజారిటీ నేతలు ఒప్పుకున్నారు. అయితే టీడీపీతో కలిసి ఉన్నన్నాళ్లు మనం బలపడలేమనే భావన పలువురిలో వ్యక్తమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: