ఎడిటోరియల్: చంద్రబాబూ.. కుట్రను చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావ్..?

Vasishta

నంద్యాల ఉపఎన్నికను ఆపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారనే వార్త ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమవుతోంది. ఓ ఉపఎన్నికకు సంబంధించి చంద్రబాబు ఇంతటి సెన్సేషన్ కామెంట్స్ ఎందుకు చేశారు.. ఓడిపోతామనే భయమా..? అభద్రతాభావమా..?


          నంద్యాల ఉపఎన్నిక టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకమే.! ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసం ఆయా పార్టీలు వ్యూహాలు – ప్రతివ్యూహాలు పన్నుతుంటాయి. మాటలతూటాలు పేల్చుతుంటాయి. ఇప్పటికే ఈ రెండు అంశాల్లో టీడీపీ, వైసీపీలు బిజీగా ఉన్నాయి. చంద్రబాబును టార్గెట్ చేసుకుని జగన్ ఎన్నో కామెంట్స్ చేశారు. అలాగే వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీకి చెందిన నేతలకు టీడీపీ గాలం వేసింది. ఇంతవరకూ బాగానే ఉంది.


          అయితే.. నంద్యాల ఉపఎన్నికను ఆపేందుకు ప్రతిపక్షం కుట్రచేస్తోందంటూ అధికారపక్షం నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పైగా ఆ వ్యాఖ్యలు చేసింది సాదాసీదా లీడర్ కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఇలా వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తారు.


          ఓడిపోతామనే భయం టీడీపీకి లేదు. ఎందుకంటే ఆ పార్టీ చాలా ధీమాగా కనిపిస్తోంది. మరి ఇలాంటప్పుడు ప్రతిపక్షంపై ఇంతటి అభియోగం మోపడం వెనుక అసలు ఉద్దేశమేంటి? ఒకవేళ ప్రతిపక్షం నిజంగా అలాంటి కుట్రలు చేస్తూ ఉంటే.. అధికారంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు..? మీ దగ్గర దీనికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే ఎన్నికల కమిషన్ ముందు పెట్టొచ్చు కదా..? కనీసం మీడియా ముందు ఉంచొచ్చు కదా..? ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు.?


          ప్రభుత్వం అన్నాక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏ అంశంపైనైనా సమాచారం కావాలంటే క్షణాల్లో తెప్పించుకోలదు. మీరు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు.? నంద్యాల ఎన్నికను ఆపేందుకు నిజంగా కుట్ర జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోవడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు..? లాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.


          విమర్శించాలి కాబట్టి ఏదో ఓ రాయి వేశాం అంటే కుదరదు. ఎందుకంటే ఓ ఎన్నికను ఆపే స్థాయిలో కుట్ర జరుగుతోందంటే అది ఆషామాషీ విషయం కాదు. తప్పు జరుగుతోందని తెల్సినప్పుడు దాన్ని అడ్డుకోకపోవడం, దాని గురించి ప్రజలకు తెలియజేయకపోవడం కూడా నేరమే.! అధికారంలో ఉన్న పార్టీకి ఈ అంశంలో మరింత బాధ్యత ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఇదే! మరి చంద్రబాబు ఆ సాహసం చేయగలరా..? కుట్రకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టగలరా..? లేకుంటే చంద్రబాబును పిరికితనంతో సతమతమవుతున్నారని భావించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: