కంటి చూపుతో...ఖతం..

రాష్ట్రంలో అదికారం దక్కించుకోవడానికి అన్నిపార్టీల ముందున్న అసలు సమస్య తెలంగాణ,సమైక్యాంధ్ర. అందరు పెదవులకు పనిచెప్పి ఈసమస్యను అధిగమించే ప్రయత్నాలు చేస్తుండగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మాత్రం అందరిలా పెదవికి పని చెప్పకుండా కంటి చూపుతోనే ఈసమస్యను ఖతం చేసే పనిలో పడ్డారు. దీనికోసమే ఆయన సృష్టించిన రెండుకళ్ల సిద్దాంతం దాని పని అది చేసుకుపోతోంది. తెలంగాణ విషయంలో ఒకసారి పెదవులు తడబడితే అక్కడ పార్టీ ఖాలీ అయింది.దీంతో తేరుకున్న చంద్రబాబు సీమాంధ్రవిషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వ్యవహారం కనపడుతోంది. తాను నోరువిప్పి ఏం మాట్లాడినా అసలుకే ఎసరు వచ్చేలా ఉండడంతో తన మాటలను తన కంటిచూపులతో కానిస్తున్నాడని అంటున్నారు. ఇందులో భాగమే బైరెడ్డి ఘాటువాఖ్యలు చేయడమని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణ కన్ను ఇప్పటికే ఆప్రాంతంలో కథ నడిపిస్తుండగా, సీమాంధ్రకన్ను పనిని బైరెడ్డితో మొదలుపెట్టారని అనుకుంటున్నారంతా. బైరెడ్డికూడా ఉద్యమం వేరు,పార్టీవేరు అంటూ నొక్కి వాఖ్యానించడం వెనుక చంద్రబాబు లోతైన ఆలోచన దాగిఉన్నట్లు కనిపిస్తోంది. అలా అనకుంటే పార్టీలోని తెలంగాణ నేతలు తనపై విరుచుకుపడి బైరెడ్డి వాఖ్యలు వెనక్కుతీసుకోవాలని,తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడకుండా చూడాలని పట్టుపట్టే అవకాశాలున్నాయి. అలా కాకపోయినా పార్టీలోని నేతలంతా రెండు ప్రాంతాలవారీగా విడిపోయి ఒకరిపై ఒకరు మాటలయుద్దానికి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రేస్ ఆపరిస్థితితోనే రాష్ట్రంలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నది ఆయనకు బాగా తెలుసు.ఇలా అయితే ఎవరి ప్రాంతాల మనోభావాలు వారివి,తెలంగాణకోసం మీరు చేస్తున్నట్లు గానే వారిప్రాంత క్షేమం కోసం వారు నడుచుకుంటారు, పార్టీ ప్రయోజనాలు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినవద్దు కదా అని పార్టీలోని ఇరుప్రాంతాల నేతలను సముదాయించ వచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంకలసి రాక చంద్రబాబు వ్యూహాలన్నీ బెడసికొడుతున్నాయి. అదే జరిగి ఇది బెడసికొడితే ఇక చంద్రబాబు ‘అనుకున్నామని అయిపోవన్ని...అనుకోలేదని ఆగవుకొన్ని..‘ అంటూ పాడుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: