హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన వాన పట్నాన్ని ముంచెత్తింది. శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మోకాలులోతు నీళ్లు వచ్చి చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరువచ్చి చేరింది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పాత గోడలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షానికి పలువురు నిండు ప్రాణాలు కోల్పోయారు. ఆదిత్యనగర్‌లో గోడకూలి తల్లీ ముగ్గురు పిల్లలు చనిపోయారు.
బాలానగర్ ప్రాంతంలో కూడా గోడకూలి నలుగురు చనిపోయారు. భారీ వానలు నగరాన్ని అతలాకుతలం చేసింది. వానలకు నీరు వచ్చి చేరడంతో ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. రాజ్ భవన్ రోడ్డులో కార్లు కూడా నీటిలో కొట్టుకునిపోయాయి. ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంటి నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. కాలువల్ని తలపిస్తున్నాయి. దీనితో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోడ్లన్నీ జలమయంగా కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి అయిన అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సంజీవ్ రెడ్డి నగర్ ప్రాంతంలోని రోడ్లపై నీరు వచ్చి చేరింది. వనస్థలిపురం, సరూర్ నగర్, బేగంపేట, జూబ్లిహిల్స్ లోని పలు కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. పలు చోట్ల మ్యాన్ వోల్స్ నీట మునిగాయి. దీనితో ఎక్కడ మ్యాన్ వోల్స్ ఉన్నవి తెలియడం లేదు. వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
అనేక కాలనీలు నీళ్లలో మునిగిపోయాయి. పాతబస్తీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షం పట్నాన్ని ముంచెత్తడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నగర పాలక సంస్థ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తక్షణమే సహాయచర్యలు తీసుకోవల్సిందిగా సీఎం ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: