చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్‌.... ఆ ఇద్ద‌రూ జంపేనా...!

VUYYURU SUBHASH
ఇటీవల ఎన్నికల ఓటమి దగ్గర నుంచి టీడీపీకి గట్టి షాకులే తగులుతున్నాయి. ఓటమి తర్వాత చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం లేని నేత‌లంతా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇత‌ర దారులు వెతుక్కుంటున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రెండు నెల‌ల‌కే ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతానికి వైసీపీ డోర్లు లాక్ చేయ‌డంతో టీడీపీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉంటున్నారు.


మ‌రో ప‌క్క వైసీపీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు మాత్రం 15 మంది వ‌ర‌కు టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని ప్ర‌కంప‌న‌లు రేపుతూనే ఉన్నారు. వైసీపీలోకి వెళ్లాలంటే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న కండీష‌న్ ఉండ‌డంతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. ఐదేళ్ల పాటు టీడీపీలో ఉంటే రాజ‌కీయంగా ఒరిగేదేం లేదు. బీజేపీని న‌మ్ముకుంటే కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డంతో పాటు ఆర్థికంగా కాస్త వెన్నుద‌న్ను ఉంటుంద‌న్న‌దే వారి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే టీడీపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే తీవ్ర అసంతృప్తితోఉంటోన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు చంద్ర‌బాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రు బాబుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఈ తరుణంలోనే విజయవాడ లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి వీరు డుమ్మా కొట్టారు. కొంద‌రు రాక‌పోయినా ముందుగానే అనుమ‌తి తీసుకున్నా... ఈ ఇద్ద‌రు మాత్రం కావాలనే సమావేశానికి రాలేదని తెలుస్తోంది. 


ఎంపీ కేశినేని నాని రెండోసారి ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచి బాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. జిల్లా రాజ‌కీయాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పెత్తానాన్ని ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే బాబు ఇచ్చిన ప‌ద‌విని సైతం ఆయ‌న తిర‌స్క‌రించారు. త్వరలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అందుకే అలా మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్య‌ల‌కు ఊతం ఇచ్చేలా నాని బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు.


ఇక గంటా శ్రీనివాసరావు పార్టీ ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. అటు విశాఖ జిల్లాలో పార్టీ కార్య‌క్ర‌మాల‌తో పాటు రాష్ట్ర పార్టీ కార్య‌క‌లాపాల‌కు కూడా హాజ‌రుకావ‌డం లేదు. ఆయ‌న కూడా త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌ను బ‌ట్టి వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్ల‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఇద్ద‌రు నేత‌లు కీల‌క స‌మావేశానికి చెప్పుకుండా డుమ్మా కొట్ట‌డంతో వీరు పార్టీ మార్పు అంశం టీడీపీలో మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: