చిన్న పరిశ్రమలకు పెద్ద అండ.. మంత్రి ' కొండపల్లి ' ..!
ఈ నేపథ్యానికి తోడు.. ఉన్నత విద్యావంతుడు కూడా కావడంతో సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలో వెనువెంటనే చోటు కల్పించారు. ప్రస్తుతం మూడు కీలక శాఖలకు కొండపల్లి మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కీలకమైన చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, ఎన్నారై విభాగం, గ్రామీణ పేదరిక నిర్మూల శాఖకు కొండపల్లి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే శాఖ.. చిన్న-సూక్ష్మ-మధ్యతరహా పరిశ్రమల శాఖ. ప్రస్తుతం ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి ఈ శాఖ అత్యంత కీలకం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలనుంచి ఒక్కొక్క పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనిపదే పదే చంద్రబాబు చెబుతున్నారు. దీనికి చిన్న - సూక్ష్మ- మధ్యతరహా పరిశ్రమలే కీలకం. అంతో ఇంతో పెట్టుబడి ఉంటే తప్ప.. పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం సాధ్యం కాదు. కానీ, ఈ శాఖలో ఎలాంటి పెట్టుబడులు లేకుండానే.. కేవలం నైపుణ్యం ఉంటే చాలు.. అన్నట్టుగా మంత్రి కొండపల్లి వ్యవహరిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి.. యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నైపుణ్యాభివృద్ధి పోర్టల్‌ను ఏర్పాటు చేయించారు. యువత నైపుణ్యాలను పెంచేందుకు మండల స్థాయిలో కేంద్రాలను కూడా నెలకొల్పారు.
తద్వారా యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. బ్యాంకులతోనూ తరచుగా సంప్రదిస్తున్నారు. వారికి రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే.. వ్యక్తి గతంగా కొండపల్లి శ్రీనివాస్.. సాఫ్ట్వేర్ వృత్తి నుంచి రావడంతో ఆయనే స్వయంగా నైపుణ్యాభివృద్ధి పోర్టల్‌ను డిజైన్ చేశారన్న విషయం చాలా తక్కువ మందికితెలుసు. దీనిని ప్రభుత్వం ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా నేరుగా వినియోగిస్తూ.. యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు.. పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఎన్నారై శాఖ మంత్రిగా విదేశీ వ్యవహారాల విషయంలోనూ కొండపల్లి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎదురైన ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారిని.. తీసుకువచ్చేందుకు, వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవడమే కాకుండా.. ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు. యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చేందుకు వారికి భరోసా కల్పించేందుకు మంత్రి కొండపల్లి ప్రయత్నించడం గమనార్హం.
వివాదాలకు అతీతం..!
ఇక, రాజకీయంగా విజయనగరం కీలకం. వైసీపీకి సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా కూడా ఇదే. అక్కడ మహామహులు అయిన వైసీపీ నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో సహజంగానే ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం మూడు జిల్లాల్లోనూ రాజకీయాలు కొనసాగుతుంటాయి. మంత్రి కొండపల్లి విషయానికి వస్తే.. ఆయన ఎప్పుడూ.. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. తన శాఖను చూసుకోవడంతో పాటు గజపతి నగరం నియోజకవర్గం అభివృధ్ధిపైనే దృష్టి పెడుతున్నారు. విమర్శలకు, వివాదాలకు తావులేకుండా... ఫైర్ బ్రాండ్ ముద్ర కోసం పాకులాడకుండా.. సౌమ్యంగా ముందుకు సాగుతూ.. తన దైన శైలిని కొనసాగిస్తుండడం గమనార్హం.