రేషన్ కార్డు లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. రేషన్ కార్డుదారులకు అతి తక్కువ ధరకే నాణ్యమైన గోధుమ పిండిని అందించే కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం రూ. 20లకే కిలో గోధుమ పిండిని అందిస్తోంది.

పాలిష్ చేసిన సన్న బియ్యం కంటే రేషన్ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కిలో బియ్యంపై రూ. 47.10 వరకు సబ్సిడీ భరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా దీనిని విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీ విధానం పట్ల విమర్శలు చేస్తూ, ఇప్పుడు పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు తెచ్చామని ఆయన వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల ప్రకారం, రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ రేషన్ షాపులోనైనా సరకులు తీసుకునేలా స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌకధరల దుకాణాలు తెరిచి ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల సామాన్యులకు రేషన్ సేకరణ సులభతరం అవుతుంది.

అంతేకాకుండా, డీలర్ల ఆదాయం పెంచేలా త్వరలో కొండ ప్రాంతాల ఉత్పత్తులు, సేంద్రియ (Organic) ఆహార పదార్థాలను కూడా రేషన్ షాపుల ద్వారా విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పేద ప్రజల పోషకాహార అవసరాలను తీర్చడమే కాకుండా, రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. మంత్రి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: