రాష్ట్రంలో జిల్లాల విభజన ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా వేదికగా మాట్లాడుతోంది. కొన్ని జిల్లాలు అనవసరంగా చేశారని వాటిని తగ్గించే యోచనలో ఉన్నామని అన్నది. అంతేకాదు కొన్ని నియోజకవర్గాలను ముక్కలుగా చేసి పలు జిల్లాల్లో కలిపి ప్రజలను ఇబ్బంది పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఖండించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వెంటనే భయపడిపోయినటువంటి తలసాని నేను రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా మీడియా ముఖంగా ప్రకటించారు.. సికింద్రాబాద్ ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారు తలసాని.. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తులంటే నాకు కూడా గౌరవం ఉందని, నా ప్రాంతంపై నాకున్న అభిమానంతో ఆ వ్యాఖ్యలు చేశాను కానీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు గమనించగలరని అన్నారు.. సికింద్రాబాద్ ను అసలు టచ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ సికింద్రాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజ్ గిరి జోన్ లోకి ఎలా వెళ్లాయని,ఇది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చుకున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ అనేది జిహెచ్ఎంసి లోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించడానికే అంటూ విమర్శించారు. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్రలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ హెచ్చరించారు. సికింద్రాబాద్ చరిత్రను కాపాడుకోవడానికి పోరాటాలు చేయడానికి అయినా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ప్రకటించాలని తలసాని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ విభజనను నిరసిస్తూ ఈనెల 17న శాంతి రాలి నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ ర్యాలీ అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై క్లాక్ టవర్,ప్యాట్నీ,ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలియజేశారు. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే వరకు నా పోరాటం ఆగదు అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరి చూడాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విభజన నిర్ణయం ప్రజలకు మేలు కలుగుతుందా లేదంటే ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి పై వివాహస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ తలసాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో చాలామంది రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ మానియాకి భయపడిపోయారు అంటూ మాట్లాడుకుంటున్నారు.