నిందితులకు శిక్ష లేకుండా తప్పించిన ఎలుకలు ఇదేం మాయ మావ!

Thota Jaya Madhuri
ఎలుకల కారణంగా 200 కిలోల గంజాయి మాయం కావడం, ఆ కారణంతోనే మూడేళ్ల నాటి డ్రగ్స్ కేసులో నిందితుడు నిర్దోషిగా విడుదల కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన న్యాయవ్యవస్థ, దర్యాప్తు వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

రాంచీ నుంచి రామ్‌గఢ్‌కు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో 2022 జనవరి 17న రాంచీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా, అందులో సుమారు 200 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిలో ఒకరైన ఇంద్రజిత్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరు అక్కడినుంచి తప్పించుకున్నారు.అప్పటి నుంచి ఇంద్రజిత్ రాయ్ పోలీసు కస్టడీలోనే ఉండగా, అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే కేసు విచారణ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2024లో కోర్టు ముందు మాదకద్రవ్యాలను హాజరుపరచాల్సిన సందర్భంలో, పోలీసులు నిల్వ చేసిన గోదాంలో ఎలుకలు గంజాయిని తినేశాయని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలియజేశారు. దాదాపు 200 కిలోల గంజాయి ఎలుకల వల్ల నాశనం అయిందని చెప్పడం కోర్టును ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ వాదనను రాంచీలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. దర్యాప్తులో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయని, ముఖ్యంగా “ఎలుకలు 200 కిలోల గంజాయిని తినేశాయి” అన్న వివరణ నమ్మశక్యంగా లేదని కోర్టు స్పష్టం చేసింది. మాదకద్రవ్యాలను ఎలా స్వాధీనం చేసుకున్నారు, వాటిని ఎలాంటి భద్రతతో నిల్వ ఉంచారు అనే అంశాలపై కూడా కోర్టు తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది.కేసులో సాక్షులుగా హాజరైన ఏడుగురు పోలీసులు పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడాన్ని కోర్టు గమనించింది. పోలీసులు వాహనాన్ని ఎక్కడ అడ్డుకున్నారు, ఏ సమయంలో ఈ ఘటన జరిగింది వంటి కీలక అంశాలపై స్పష్టత లేకపోవడం ప్రాసిక్యూషన్ బలహీనతను బయటపెట్టింది. అంతేకాకుండా, రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇంత పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఒక్క స్వతంత్ర సాక్షిని కూడా చేర్చకపోవడం కోర్టు దృష్టిలో తీవ్రమైన లోపంగా మారింది.

ఈ నేపథ్యంలో, నిందితుడిపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని కోర్టు తేల్చింది. అదనపు జ్యుడీషియల్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ డిసెంబర్ 19న ఇచ్చిన తీర్పులో, ఇంద్రజిత్ రాయ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల స్వాధీనం, వాటి భద్రపరిచిన తీరుపై పోలీసుల వైఫల్యమే ఈ కేసు కొట్టివేయబడడానికి ప్రధాన కారణమని కోర్టు స్పష్టం చేసింది.ఈ సంఘటనతో “నేరస్తులు తప్పించుకోవడానికి ఎలుకలే కారణమయ్యాయా?” అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. డ్రగ్స్ వంటి తీవ్రమైన నేరాల్లో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం, చివరకు నిందితుడు నిర్దోషిగా బయటపడటం చట్టవ్యవస్థ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై అయినా మాదకద్రవ్యాల కేసుల్లో సరైన దర్యాప్తు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: