HBD జగన్: ఏపీ పొలిటికల్ చరిత్రనే మార్చేసిన లీడర్..జగన్ మోహన్ రెడ్డి..!
ఈ సందర్భంగా ప్రత్యేకంగా జగన్ రాజకీయ ప్రయాణం, ఆయన రాజకీయాల్లోకి రాకముందు పరిస్థితి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు, ఆయన అనుసరించిన వ్యూహాలు వంటి అంశాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎందరో అగ్ర నేతలు ఉన్నప్పటికీ, వారందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తింపునొందారు అనే అంశంపై కూడా లోతైన విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాలు అంటే సామాన్య ప్రజలకు ఆసక్తి లేని అంశం. రాజకీయాలను ‘మురికి కుంట’గా భావించే పరిస్థితి ఉండేది. అలాంటి అభిప్రాయాన్ని కూడా మార్చగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ వ్యూహాలు ఎలా ఉండాలి, రాజకీయ జీవితం అంటే ఏమిటి, ప్రజలతో అనుబంధం ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలపై ప్రజల్లో కొత్త చర్చ మొదలైంది.
ఒకప్పుడు “జగన్” అనే పేరు చాలామందికి తెలియని పరిస్థితి. కానీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత, రాత్రికి రాత్రే జగన్మోహన్ రెడ్డి పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. తండ్రి మరణం తర్వాత ఆయనపై పడిన బాధ్యతలు, ఎదురైన రాజకీయ సవాళ్లు, వాటిని ఎదుర్కొంటూ ఆయన నిలబడ్డ తీరు ప్రజలను ఆకట్టుకుంది. అదే సమయంలో ఆయన ప్రజల కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని తెరలేపింది.
యువ రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా తన రాజకీయ దృక్పథాన్ని స్పష్టంగా ప్రకటించారు. అభివృద్ధి లక్ష్యంగా, పేదల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఆయన సాగించిన పాలన నిజంగా అపూర్వమైనదని చెప్పాలి. కులం చూడకుండా, మతం అడగకుండా, రాజకీయ రంగులతో సంబంధం లేకుండా, అర్హతే ప్రమాణంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ధీశాలి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నవరత్నాల సంక్షేమ రథాన్ని విజయవంతంగా ముందుకు నడిపారు. పేదవాడి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చారు. డిజిటల్ విద్యకు బాటలు వేసి, భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి, పాలనను నేరుగా ప్రజల గడప వద్దకే తీసుకెళ్లారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైద్య ఖర్చుల భారం నుంచి లక్షలాది కుటుంబాలకు విముక్తి కల్పించారు. రైతులకు భరోసాగా నిలిచే పథకాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే కార్యక్రమాలు ఆయన పాలనలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాలనలో లబ్ధి పొందిన అనేక మంది తమ జీవితాల్లో వచ్చిన మార్పులను గుర్తు చేసుకుంటూ, తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇది ఒక నాయకుడికి ప్రజలిచ్చే నిజమైన గౌరవం, ప్రేమకు నిదర్శనం.
ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల మధ్య నిలిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రయాణం, పాలనా విధానం, సంక్షేమ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు… అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ…జగన్ ని బ్లెస్ చేస్తున్నారు..!