'సామాజిక తెలంగాణ' మాస్ ప్లాన్: కవిత కొత్త పార్టీతో 2029 రాజకీయం!

Amruth kumar
తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన కవిత... 2029 సార్వత్రిక ఎన్నికలలో 'సామాజిక తెలంగాణ ను లక్ష్యంగా చేసుకొని తాము పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలకు మరింత మాస్ బలం చేకూర్చింది. కవిత ఎక్స్ (X) వేదికగా నిర్వహించిన 'ఆస్క్ కవిత' సెషన్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.



2029కి రెడీ: పార్టీ పేరు ప్రజల నుంచే! .. కొత్త పార్టీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికరంగా స్పందించారు. 2029 ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, పార్టీ పేరును కూడా ప్రజలు సూచించిన దానినే పెడతామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో, ఆమె 2029 ఎన్నికలకు చాలా ముందుగానే 'మాస్ ప్లానింగ్' చేస్తున్నట్టు స్పష్టమైంది. తొలి ప్రాధాన్యం యువతే: రాజకీయాల్లో తమ తొలి ప్రాధాన్యం యువతకు ఉద్యోగాల కల్పనే అంటూ కవిత తేల్చిచెప్పారు. మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి జాగృతి కృషి చేస్తుందని, వారికి నచ్చిన రంగాలలో రాణించేలా ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై 'ఫైర్' బ్రాండ్! .. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా కవిత ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను చెరిపేసే పనిలో భాగంగా... తాజాగా ఆమె రేవంత్ రెడ్డి పాలనను గట్టిగా టార్గెట్ చేశారు.

 

కాంగ్రెస్ 'అట్టర్ ఫ్లాప్': హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఈస్ట్ సిటీ ఫోకస్: సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యమిస్తానని కవిత స్పష్టం చేశారు. అలాగే, హైదరాబాద్ వెస్ట్ అభివృద్ధిపై చూపిన శ్రద్ధ ఈస్ట్ సిటీపైన లేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ డ్రామాను ఖండించారు. కవిత ప్రకటనలు చూస్తుంటే, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రధాన అజెండాగా మార్చి, 2029 నాటికి తెలంగాణలో రాజకీయ సమతుల్యతను మార్చేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కవిత ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: