వైసీపీలో బుట్టా రేణుకకు అంతర్గత పోరు మొదలైందా...?
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పలు జిల్లాలు .. నియోజకవర్గాల్లో నేతల మధ్య అసంతృప్తి, అసమ్మతి పోరు ఎక్కువుగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న వేళ నాయకులు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సింది పోయి .. ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రెండు కీలక నేతల మధ్య వర్గ పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు చెన్నకేశవ రెడ్డి మధ్య ఇప్పటికే కొన్ని నెలలుగా సున్నితంగా కొనసాగుతున్న విభేదాలు, ఇప్పుడు బహిరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకలాపాల్లో బుట్టా రేణుకకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, అలాగే స్థానికంగా చెన్నకేశవ రెడ్డి తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం ఈ విభేదాలకు కారణంగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరూ వేర్వేరుగా కనిపించడం, ఒకరి కార్యక్రమానికి మరొకరు హాజరుకాకపోవడం ఈ వాదనకు బలాన్నిస్తోంది.
ఇటీవలి కాలంలో జిల్లాలో జరిగిన కొన్ని సమావేశాల్లో రేణుక అనుచరులకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆమె వర్గం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. చెన్నకేశవ రెడ్డి వర్గం మాత్రం పార్టీలో తాము శ్రమించి విజయానికి కృషి చేశామంటూ చెప్పుకుంటున్నారు. బుట్టా రేణుక స్తానికంగా బీసీ నాయకత్వాన్ని తెరమీదకు తెస్తున్నారు. పార్టీ తరపున గెలిచిన మహిళా , బీసీ ఎంపీని తాను అని .. పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ తనను కొందరు పార్టీ నేతలే అణగ దొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆవేదనతో ఉన్నారట. ఈ పరిస్థితుల్లో, వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకత్వం ఈ అంతర్గత గొడవలను ఎలా నియంత్రిస్తుందన్నది కీలకం కానుంది. నియోజకవర్గ స్థాయిలో ఈ వివాదం సాగితే, పార్టీపై ప్రజలలో ప్రతికూలత పెరిగే ప్రమాదం ఉంది. పార్టీ శ్రేణులు ఈ విభేదాలపై త్వరితగా స్పందించి, రెండుపార్టీల మధ్య సమన్వయం తీసుకురాకపోతే .. వచ్చే ఎన్నికల నాటికి ఇది నియోజకవర్గంలో పార్టీకి మరింత మైనస్ కానుంది.