కొలికపూడి శ్రీనివాస్ కథ – ఉద్యమం నుంచి రాజకీయ తడబాటు వరకు!
ఇక్కడ నాయకులకు అనేక నియమాలు, పార్టీ లైన్లు, రాజకీయ ఒత్తిడులు, సామాజిక వర్గాల సమన్వయం, ఓటు బ్యాంకు లెక్కలు వంటి అంశాలు పరిధులు విధిస్తాయి. సమయానికి, సందర్భానికి తగినట్లుగా తమ పంథాను మార్చుకోవాలి. ఈ కారణంగానే, ఉద్యమాలలో నుంచి వచ్చి, రాజకీయాలలో దీర్ఘకాలికంగా సక్సెస్ అయినవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తొలి విజయం సాధించినా, తర్వాత రాజకీయాల ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే, లోక్‌సత్తా ఉద్యమం ద్వారా రాజకీయ బాట పట్టిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) కూడా తమ సత్తాను చాటలేకపోయారు. దీనికి ప్రధాన కారణం, ఉద్యమాల స్వభావానికీ, రాజకీయం డిమాండ్ చేసే పంథాకీ మధ్య ఉన్న అంతరమే. కొలికపూడి శ్రీనివాస్‌పై చర్చ ఎందుకు? .. అమరావతి రాజధాని ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ప్రముఖ నాయకుల్లో ఒకరైన కొలికపూడి శ్రీనివాస్, గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశించారు.
అమరావతి ఉద్యమకారులలో ఈయన ఒక్కరికే రాజకీయంగా అవకాశం లభించింది. అయితే, ఆయన ఉద్యమానికీ, రాజకీయాలకు మధ్య ఉన్న తేడాను సరిగ్గా గుర్తించలేక తడబడ్డారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక, విమర్శలు, అవమానాలు, ఎదురుదెబ్బలు సహజం. వాటిని తట్టుకుని నిలబడటమే నాయకత్వ లక్షణం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడును ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత విమర్శలు, జైలు శిక్ష వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన రాజకీయంగా నిలబడగలిగారు. ఉద్యమ స్ఫూర్తితో పాటు ఈ రాజకీయ సహనాన్ని, వ్యూహాత్మక మార్పును అలవర్చుకోకపోతే, అది ఉద్యమకారుల రాజకీయ ప్రస్థానానికి మొదలు, చివర రెండూ అవుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక సిద్ధాంతానికే కట్టుబడి ఉంటే, రాజకీయాలలో విజయం సాధించడం అసాధ్యం.