జూబ్లీహిల్స్‌లో సస్పెన్స్ యుద్ధం: ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థితి!

Amruth kumar
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేకుండా సస్పెన్స్‌గా మారింది. ప్రజల నాడిని అంచనా వేసే సంస్థలకే ఈ సారి కష్టంగా మారింది. ప్రతి రోజూ కొత్త సమీకరణాలు, కొత్త లెక్కలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సానుభూతి వేవ్‌ కనబడుతుంటే, మరికొన్ని చోట్ల సర్కారు పథకాల ప్రభావం చర్చనీయాంశంగా మారింది. ఇక మోడీ మానియా కూడా ఓపెన్‌గా కనిపిస్తోంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ – మూడూ పార్టీలూ తామే గెలుస్తామని ధీమాగా ఉన్నాయి.



మహిళా సెంటిమెంట్‌ ఈసారి గణనీయంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రతిపక్షాల్లో ఎక్కువగా ఉంది. మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత బరిలోకి దిగడం సానుభూతిని తెచ్చిపెడుతుందనే భావన బీఆర్‌ఎస్‌లో బలంగా ఉంది. అయితే అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన నవీన్‌ యాదవ్‌ ఈసారి తన గత ఓటమికి రివెంజ్‌ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు 35 వేల ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్‌ కోల్పోయారు. కానీ ఇప్పుడు స్థానిక స్థాయిలో బలంగా పని చేస్తున్నామని, ఈసారి భారీ మెజారిటీ సాధిస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.



బీజేపీ అభ్యర్థి లంకలపల్లి దీపక్‌రెడ్డి కూడా 50 వేల పైగా మెజారిటీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. మోడీ మానియా, హిందూత్వ వేవ్‌ తమకు పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ మాత్రం “లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం” అంటూ బిగ్‌ గేమ్‌ ప్లాన్‌ వేసింది. కేటీఆర్‌ మాట్లాడుతూ – కేసీఆర్‌పై ప్రజల్లో పెరుగుతున్న సానుభూతి, మాగంటి ఫ్యామిలీకి ఉన్న ఆదరణ, సునీతమ్మ ఇమేజ్‌ తమకు పెద్ద ప్లస్‌ అవుతుందని చెప్పారు. ఇక చివరి 17 రోజులు ఎన్నికల ప్రచారానికి కీలకం కానున్నాయి. స్టార్‌ ప్రచారకర్తలు, నాయకులు రంగంలోకి దిగితే సమీకరణాలు మరింత మారే అవకాశం ఉంది. మొదటి సర్వేల్లో బీఆర్‌ఎస్‌కి స్వల్ప ఎడ్జ్‌ ఉన్నప్పటికీ, తాజాగా కాంగ్రెస్‌ పుంజుకుంటోందనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. మొత్తానికి — జూబ్లీహిల్స్‌ పోరులో గెలుపు ఎవరికి? ఓటమి ఎవరికి? అనేది నవంబర్‌ 27 వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: