కవిత బాణం గురి ఎటువైపు? మరో షర్మిల అవుతారా?
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. కవిత పార్టీ గురించి ప్రస్తావిస్తూ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏకంగా 6 పేజీల లేఖ రాయడంతో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ సభలో జరిగిన లోపాలు, బీజేపీపై విమర్శలు చేయకపోవడం, బీఆర్ఎస్ ఇంచార్జీల విషయం ఇలా చాలా అంశాలపై కవిత లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి లేఖలు బయటకు రాలేదు. తాజాగా బటయకు వచ్చిన లేఖను కూడా బీఆర్ఎస్ నేతలు, వారి సంబంధిత సోషల్ మీడియా కూడా ఖండించడం లేదు.
దీంతో ఆ లేఖ నిజమే అని తేలిపోయింది. కవిత లేఖ సంచలనంగా మారడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్‌లో లుకలుకలు బయటపడ్డాయని, ఆ పార్టీ పంచాయితీ ఇప్పుడు బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ కూతురు కవితనే బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాన్ని బయటపెట్టిందని విమర్శలు చేస్తున్నారు. ప్రజలే కాకుండా కవితకు కూడా బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ గురించి తెలిసిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఆ కుటుంబంలో విబేధాలు తారా స్థాయికి చేరాయని అంటున్నారు. ఈ క్రమంలో కవిత పార్టీ మారుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమె సొంత పార్టీ పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ విషయంలోనూ ఇలానే జరిగింది. జగన్ సోదరి షర్మిల వైసీపీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీని తెలంగాణలో స్థాపించారు. కానీ పార్టీకి పెద్దగా క్రేజ్ రాకపోవడంతో తిరిగి ఏపీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. అప్పుడు షర్మిల బాణం జగన్ కే గురి పెట్టిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కవిత బీఆర్ఎస్ కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ అసంతృప్తితో కనిపించడంతో అసలు ఆమె బాణం ఎటువైపు అన్న చర్చ జరుగుతోంది. ఈ వార్తలు అన్నింటికీ పులిస్టాప్ పాడాలి అంటే పార్టీ అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాల్సిన అవసరం ఉంది.