
పీ-4 కోసం ఒంటి చేత్తో బాబు.. ఎమ్మెల్యేల లెక్కలేంటి...?
ఈ పరంపరలోనే చంద్రబాబు ఇప్పుడు పీ-4 మంత్రాన్ని పఠిస్తున్నారు. దేశంలోనే ఇది తొలి ప్రయోగం. పేదరికంలో ఉన్న కుటుంబాలను ఉన్నతస్థాయికి తీసుకువచ్చి.. వారికి మెరుగైన జీవనం కల్పించా ల న్నది ఈ పథకం లేదా కార్యక్రమం ప్రధాన సూత్రం. పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్ షిప్‌గా పేర్కొనే ఈ కార్యక్రమంలో ఉన్నత స్తాయి వర్గాలను భాగస్వామ్యం చేసి.. పేదల కుటుంబాలను ఆదుకోవాలని తలపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నారు.
అయితే.. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. ప్రజలను ఒప్పించేందుకు.. కేవలం చంద్రబాబు మాత్రమే కష్టపడుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. క్షేత్రస్థాయిలో టీడీపీ ఒక్క పార్టీకే 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు , లోకేష్‌లను పక్కన పెడితే.. 132 మంది ఉన్నారు. మరి వీరంతా ఏం చేస్తున్నారు? పీ-4 పై ఎందుకు ప్రచారం చేయడం లేదు. ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదు? ఇదీ .. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇప్పటికి మూడు సార్లు చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చి .. పీ4పై ప్రచారం చేశారు. మరి ఒక్క ఎమ్మెల్యే అయినా.. ఒక్క మంత్రి అయినా.. ఎందుకు ప్రజల మధ్యకు వచ్చి.. దీనిని ప్రచారం చేయడం లేదు. బంగారు కుటుంబాలను ఎందుకు ఒప్పించలేక పోతున్నారు. మార్గదర్శకులు(ఉన్నతస్థాయి వర్గాలు)ను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అన్నీ చంద్రబాబే చేయాలా? ఒంటి చేత్తో ఆయనే కష్టపడాలా? ఇదేమంతం కొరుకుడు పడని వ్యవహారమా? ఈ విషయాలు ఎమ్మెల్యేలు ఆలోచించుకుంటే.. చంద్రబాబుకు తిప్పలు తప్పుతాయని అంటున్నారు మేధావులు.