ఏపీ: పెన్షన్ లపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..నోటీసులు జారీ.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో చర్యలు చేపట్టాలని సెర్ప్‌ సీఈఓ వీరపాండియన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా డిసెంబర్ 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను గుర్తించారు. దాదాపు 11వేల పెన్షన్లను తనిఖీ చేస్తే అందులో 563మంది అర్హత లేకున్నా పెన్షన్లు అందుకుంటున్నట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి.అనర్హుల పెన్షన్లను తక్షణం నిలిపివేయాలని కలెక్టర్ల సదస్సుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 3.5లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ముఖ్యమంత్రికి వివరించారు.ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పెన్షన్లను జారీ చేస్తున్నట్టు, అర్హులకు మాత్రమే వాటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అనర్హులుగా గుర్తించిన వారి పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెన్షన్లను పొందడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో అనర్హులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనర్హుల జాబితాలను ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ల లాగిన్‌లలో అందుబాటులో ఉంచారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అనర్హులకు నోటీసులు జారీ చేయాలని, నిర్దిష్ట గడువులోగా వారి నుంచి సమాధానాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులకు స్పందించని వారి పెన్షన్లను హోల్డ్ లో పెట్టాలని స్పష్టం చేసింది.ఇదిలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు సెర్ప్‌ అధికారులు భావిస్తున్నారు. వికలాంగులకు రూ.15వేల వరకు పెన్షన్ చెల్లస్తున్నారు. వితంతువుల విభాగంలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది క్షేత్ర స్థాయి తనిఖ‌ీల్లో గుర్తించారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు.బధిరులు సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. లబ్దిదారుల కుటుంబంలో ఎవరికైనా కారు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే పొలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడునెలల్లో అనర్హులను గుర్తించాలని, విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: