హిందూ ఓటర్ల నీ బుట్ట లో వేసుకుంటున్న ట్రంప్? గెలుపు దక్కుతుందా..!
అవును... బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఈ క్రమంలో... ముందుగా హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్.. అనంతరం... తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ తో అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని అనాగరికమని చెప్పిన ట్రంప్.. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశాయని.. భయానక పరిస్థితులు సృష్టించాయని అన్నారు. తన హయాంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను బైడెన్, కమలా హారిస్ లూ విస్మరించారని.. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్ష్ణ కల్పిస్తామని.. హిందువుల స్వేచ్ఛకోసం పోరాడతామని.. చెడుపై విజయం సాధించేలా దీపావళి పండగ చేస్తుందని తాను నమ్ముతానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో... ఇజ్రాయెల్ నుంచి మొదలుకొని ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకూ విపత్తులు ఎన్నో ఉన్నాయని.. తాము అధికారంలోకి వస్తే అమెరికాను మళ్లీ బలంగా తయారుచేస్తామని.. శాంతిని నెలకొల్పుతామని అన్నారు. కమలా హారిస్ గెలిస్తే అధిక పనులు, కటినమైన నిబంధనలతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తారని.. తాను గెలిస్తే పన్నుల్లో కోత విధిస్తానని తెలిపారు.కాగా... అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న ఇండో అమెరికన్లను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం ఉన్న వేళ అటు అరబ్ అమెరికన్లతో పాటు, ఇండియన్ అమెరికన్స్, హిందూ అమెరికన్స్ విషయంలో ట్రంప్ భారీ వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారని అంటున్నారు పరిశీలకులు!